పుట:Hello Doctor Final Book.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉండవచ్చును. వయోజనులలోను, వ్యాధి నిరోధకశక్తి తగ్గినవారిలోను ఊపిరితిత్తుల తాపము (Pneumonitis) కలుగవచ్చును. గర్భిణీస్త్రీలలో వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉండవచ్చును. గర్భిణీస్త్రీలకు వ్యాధి కలిగి పిండమునకు వ్యాధి సోకిన గర్భస్థ శిశువు పెరుగుదలకు, అవయవముల అభివృద్ధికి అవరోధము కలిగి పుట్టుకతో కొన్ని వ్యాధులు (జన్మవ్యాధులు ; Congenital diseases) కలుగవచ్చును. సాధారణముగా ఆటాలమ్మ ప్రమాదకరము కాదు గాని, వ్యాధినిరోధక శక్తి తగ్గినవారిలో, వ్యాధి తీవ్రతరమయి చాలా అరుదుగా ( 50 వేల మంది వ్యాధిగ్రస్థులలో ఒకఱికి ) మరణము సంభవిస్తుంది. పరీక్షలు:

వ్యాధిలక్షణములు, విస్ఫోటపు లక్షణములు, సమాజములో వ్యాధి ప్రాబల్యము బట్టి వైద్యులు వ్యాధినిర్ణయము చేయగలరు. రక్తములో VZV కి ప్రతిరక్షకముల పరీక్ష చేసి సత్వర IgM ప్రతిరక్షకములను (antibodies) కనిపెట్టిన వ్యాధి నిర్ణయమైనట్లే. IgG ప్రతిరక్షకములు దీర్ఘకాలమునవి. అవి కనిపించుటకు కొద్దివారములు పడుతాయి. అవి వ్యాధినిరోధక శక్తిని సూచిస్తాయి. పొక్కులనుంచి సేకరించిన రసిని గాజుపలకపై పొరగా నెఱపి Tzanck వర్ణకముతో సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించి వ్యాధిని నిర్ణయించవచ్చును. పొక్కుల రసినుంచి డి ఏన్ ఎ గుణకార చర్యతో (DNA Polymerase chain reaction) విషజీవాంశములను గుర్తించవచ్చును. చికిత్స :

చాలామందికి జ్వరము, వంట్లో నలత తగ్గించుటకు పారసిటమాల్, లేక ఎసిటెమైనోఫెన్లను వాడవచ్చును. దుఱద ఎక్కువగా ఉంటే డైఫెన్ హైడ్రొమెన్ వంటి హిష్టమిన్ అవరోధకములను (antihistamines) వాడవచ్చును. పొక్కులను ప్రతిదినము గోరువెచ్చని నీటితో శుభ్రపరచి జింక్ ఆక్సైడు గల లేపనములను పూయవచ్చును. పిల్లలలో ఎసైక్లొవీర్ (Acyclovir) వంటి విషజీవాంశ నాశకములు

366 ::