పుట:Hello Doctor Final Book.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆల్ఫా ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములు ( alpha adrenergic receptor agonists ) : ఇవి ముక్కు  శ్లేష్మపుపొరలో ఉన్న రక్తనాళికలను సంకోచింపజేసి నీరుకారుటను అరికడుతాయి. ఆక్సిమెటజోలిన్ (oxymetazoline) ముక్కులో వాడుటకు తుంపరమందుగా లభ్యము. దీనిని ఎక్కువ దినములు వాడకూడదు. ఎక్కువ దినములు వాడి మందు మానివేసినపుడు ముక్కులో సాంద్రత (nasal congestion) విజృంభించవచ్చును (rhinitis medicamentosa ).

నోటిద్వారా తీసుకొందుకు ఫెనిలెఫ్రిన్ (phenylephrine), సూడోఎఫిడ్రిన్ ( pseudoephedrine ) వంటి  ఆల్ఫా ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములు (alpha adrenergic agonists) లభ్యము. వీటి వలన గుండెదడ, గుండెవేగము హెచ్చుట, మానసిక ఆందోళన, చీకాకు, రక్తపుపోటు హెచ్చుట, నిద్రపట్టక పోవుట, తలనొప్పి  వంటి అవాంఛిత ఫలితములు కలుగవచ్చును. అధిక రక్తపుపోటు గలవారు ఈ మందులను వాడకపోవుట మంచిది. క్రొమొలిన్ సోడియం ( Cromolyn sodium ) :

క్రొమొలిన్ సోడియం స్తంభకణములను (mastocytes) సుస్థిరపరచి తాపజనకముల (inflammatory mediators) విడుదలను అరికడుతుంది. ఆమ్లాకర్షణకణముల (eosinophils), తటస్థకణముల (neutrophils), ఏకకణముల (monocytes) ఉత్తేజమును కూడా ఇది తగ్గిస్తుంది. క్రొమొలిన్ సోడియం తుంపరమందుగా లభ్యము. దీని వలన అవాంఛిత ఫలితములు తక్కువ. మత్తు కలిగించదు. కొందఱిలో ( 10 శాతము లోపల మందిలో) దీని వలన  ముక్కులో మంట, తుమ్ములు  కలుగవచ్చును నెడొక్రొమిల్ సోడియం ( Nedocromil sodium ) :

నెడొక్రొమిల్ సోడియం కూడా స్తంభకణములను, ఇతర తాపకణములను సుస్థిరపఱచి వాటినుంచి తాపజనకముల ( inflammatory mediators ) విడుదలను అరికడుతుంది.

351 ::