పుట:Hello Doctor Final Book.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీరసము, జ్వరము వంటి లక్షణములు శరీరపు అస్వస్థతను సూచిస్తాయి. ముక్కునుంచి కారు స్రావకములు చీమును పోలి ఉంటాయి. ముక్కు, గొంతుకలలో ఎఱ్ఱదనము ఎక్కువగా ఉంటుంది. గర్భిణీస్రీలలో ముక్కు కారుట, తుమ్ములు కలుగవచ్చును (Rhinitis of Pregnancy).

ముక్కులో సాంద్రత తగ్గించే ఔషధములు (decongestants) పెక్కుదినములు వాడి మానివేసినపుడు నాసికాతాప లక్షణములు కనిపించవచ్చును ( Rhinitis medicamentosa ).

వాతావరణ కాలుష్యములు, సుగంధద్రవ్యములు అసహనము కలిగించకుండా ముక్కులో తాపలక్షణములను కలిగించవచ్చును (non allergic irritant rhinitis ). చికిత్సలు : అసహనము గల పదార్థములనుంచి తప్పించుకొనుట :

అసహనములు గలవారు అసహనములు కలిగించే పూల పుప్పొడులు, శిలీంధ్రబీజములు ( fungal spores ), ధూళిక్రిములు, జంతువుల శిధిలకణములకు (animal dander) దూరముగా ఉండుటకు ప్రయత్నించాలి. ఇళ్ళలో వాయునియంత్రణులు (air conditioners), పరమాణువు జల్లెడలు (electronic filters), ఆర్ద్రసాధనములు (humidifiers) గాలిలో పరాగములను, శిలీంధ్రబీజములను ( mold spores ), తొలగించుటకు ఉపయోగపడుతాయి. గాలిలో తగినంత తేమను సమకూరుస్తాయి. ఈ పరికరములు లేనివారు, బయటకు వెళ్ళేటపుడు ముక్కు, నోటికప్పులు (masks) వాడితే అవి గాలిని వడకట్టి పీల్చే గాలిలో ప్రతిజనకములను (allergens) అడ్డగిస్తాయి.

349 ::