పుట:Hello Doctor Final Book.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పొంగుతుంది. శ్లేష్మము (mucous)  అధికముగా ఉత్పత్తి అవుతుంది. ఆమ్లాకర్షణ కణములు (eosinophils), క్షారాకర్షణ కణములు (basophils), తటస్థ కణములు (neutrophils), ఏకకణములు (monocytes) కూడా శ్లేష్మపుపొరలోనికి రసాయన ఆకర్షణ (chemotaxis) వలన కూడి తాప ప్రక్రియకు దోహదపడుతాయి. తాపము వలన ముక్కులో దురద, తుమ్ములు, ముక్కు నీరుకారుట కలుగుతాయి. వ్యాధి లక్షణములు :

అసహనములు గలవారు అసహనము కల పదార్థముల బారి పడినపుడు వారికి అసహన నాసికా తాప (allergic rhinitis) లక్షణములు  కలుగుతాయి. ముక్కు దిబ్బడ కట్టుట, ముక్కు నుంచి నీరు కారుట (rhinorrhoea), ముక్కులోను గొంతులోను అంగుటిలోను దురద, తఱచు తుమ్ములు కలుగుతాయి. ముక్కులోని స్రావకములు గొంతులోనికి దిగుటచే దగ్గు, కఫము, గొంతు బొంగురుపోవుట కూడా కలుగవచ్చును. నాసికాకుహరముల (Paranasal sinuses) పైన నొప్పి, తలనొప్పి  కలుగవచ్చును. కనుఱెప్పల లోపొరలలో (conjunctiva) దురద, కళ్ళు నీరుకారుట కూడా కలుగవచ్చును. వైద్యులు పరీక్షించినపుడు ముక్కులో తేమ, నీటిని పోలిన స్రావకములు, ముక్కు శ్లేష్మపుపొరలో(mucosa) వాపు, కనిపిస్తాయి. వివర్ణమై  శ్లేష్మపుపొర లేత గులాబి రంగులో ఉంటుంది. ముక్కు వెలుపలి గోడలపై ఉండు నాసికాశుక్తులలో (nasal turbinates) వాపు కనిపిస్తుంది. గొంతు కూడా లేతగులాబి వర్ణములో ఉంటుంది. గొంతులో కూడా తేమ, ముక్కునుంచి వెనుకకు కారు స్రావకములు కనిపించవచ్చును. దీర్ఘకాల అసహన నాసికాతాపములు గలవారిలో క్రింద కనుఱెప్ప చర్మములో కనుగుంటల సమీపములో   నలుపుదనము కలుగవచ్చును. ముక్కుదిబ్బడ ఎక్కువగా ఉన్నవారు నోటితో గాలి పీల్చుకొనుట చూస్తాము. దుఱద ఉండుట వలన ముక్కును పిల్లలు తఱచు అరచేతితో పాముకొంటుంటారు. దీనిని allergic salute గా వర్ణిస్తారు.

346 ::