పుట:Hello Doctor Final Book.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తోడ్పడుతాయి. ఆహార వినియోగము పెరిగి, చేసే వ్యాయామము తగ్గుతే బరువు హెచ్చుతాము. ఆహార వినియోగము, జీవనవ్యాపారము + వ్యాయామపు అవసరముల కంటె తక్కువయితే బరువు తగ్గుతాము. అవసరాలకు ఆహారము సరి అయితే బరువు స్థిరముగా ఉంటుంది. అధిక భారము, స్థూ లకాయములకు కారణాలు :

పాతదినములలో ధనవంతులయిన కొద్దిమందిలో ఎక్కువ బరువు ఉండుట కనిపించేది. నవీనకాలములో ఆహార విప్లవము వలన ఆహారపదార్థాల ఉత్పత్తి పెరిగి అవి విరివిగా లభ్యము అవుతున్నాయి. చిల్లర తిళ్ళ దుకాణాలు ఎక్కువయ్యాయి. చక్కెర ఉండే శీతల పానీయాలు, చక్కెర సహిత ఫలరసాల వాడుక పెరిగింది. వేడుకలు పెరిగి శక్తిసాంద్ర ఆహారపదార్థములు (Energy rich foods) తీపివస్తువులు, పానీయాలు, మద్యము, మిగిలిన చిరుతిళ్ళ వినియోగము అన్ని సమాజాలలోను పెరిగింది. భోజనము హెచ్చయితే జీర్ణాశయము సాగుతూ పరిమాణము పెరిగి వారిలో ఆకలి కూడా పెరుగుతుంది. చక్కెరగల పానీయాలు, పదార్థాలు సేవిస్తే వారి రక్తములో చక్కెర విలువలు పెరిగి దానికి స్పందనగా  ఇన్సులిన్ విడుదలయి  దాని ప్రభావము వలన రక్తములో చక్కెర తగ్గగానే వారికి నీరసము ఆకలి పెరుగుతాయి. అపుడు వారు మరికొంత ఆహారమునో, పానీయములనో సేవిస్తారు. ఈ విషచక్రము అలా కొనసాగుతుంది. సమాజములలో మార్పుల వలన వాహనాలు పెరిగి పిల్లలు పాఠశాలలకు నడిచి వెళ్ళరు. పెద్దలు ఉద్యోగాలకు నడిచి వెళ్ళరు. దూరదర్శినులు, గణనయంత్రాలు, చరవాణుల వాడుక హెచ్చి పిల్లలు, పెద్దలు క్రీడలకు, వ్యాయామములకు వెచ్చించే కాలము తగ్గిపోయింది. పాఠశాలలలో క్రీడలకు, వ్యాయామములకు ప్రోత్సాహము తగ్గింది. జన్యు కారణాలు :

పరిసరాలు, జీవన శైలులలో మార్పులకు వేఱు వేఱు వ్యక్తులు వేఱు వేఱుగా స్పందిస్తారు. జడత్వము, వ్యాయామపు కొఱత, అధిక ఆహార వినియోగములు కొందఱిలో ఎక్కువగా ఉంటాయి. వాటికి జన్యువులు

326 ::