పుట:Hello Doctor Final Book.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారసూచిక శరీరపు కొవ్వుని సూచించదు కాని శరీరములో ఉన్న కొవ్వుతో అన్యోన్య సంబంధము కలిగి ఉంటుంది. హెచ్చు భార సూచిక అనారోగ్యమును తెలుపదు కాని అనారోగ్యములకు దారి తీస్తుంది. శరీరపు బరువును కోశాగారములో ధనముతో పోలుస్తే అర్థము చేసుకొనుట తేలిక అవుతుంది. కోశాగారములో ఎంత ధనము చేరుస్తే  ధనము అంతగా పెరుగుతుంది. ఎంత ఖర్చు పెడితే అంత క్షీణిస్తుంది. ఎక్కువ డబ్బు చేర్చి తక్కువ ఖర్చు పెడితే ధనము పెరుగుతుంది. ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ చేరుస్తే ధనము తగ్గుతుంది. తిని, త్రాగే కాలరీలు (కాలరీ వివరణ క్రింద తెలియజేయబడింది), ఖర్చయే కాలరీల కంటె హెచ్చయితే బరువు పెరుగుతారు. దేహములోనికి తీసుకొనే కాలరీలు తగ్గి, ఖర్చు చేసే కాలరీలు పెరుగుతే బరువు తగ్గుతారు.

“ఎక్కువ బరువు ఉన్నవారిలో జీవవ్యాపారము ( Metabolism) మందముగా ఉంటుంది, వారు తక్కువ తిన్నా బరువు పెరుగుతారు” అన్నది వాస్తవము కాదు. శరీరపు బరువు ఎక్కువగా ఉండుట వలన నిజానికి వారి నిత్య జీవన వ్యాపారమునకు ఎక్కువ కాలరీలే ఖర్చవుతాయి. హృదయము, ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రాంగముల వంటి ముఖ్య అవయవములపై పనిభారము వీరిలో హెచ్చు. నడిచేటప్పుడు కూడా వీరు ఎక్కువ బరువును మోయాలి కాబట్టి ఎక్కువ కాలరీలు ఖర్చుపెడతారు. ఆహారపదార్థాలను అవి యివ్వగలిగే శక్తిని బట్టి కాలరీలలో కొలుస్తారు. ఒక గ్రాము నీటి ఉష్ణోగ్రతను  వాతావరణ పీడనము వద్ద ఒక సెంటీగ్రేడు డిగ్రీ పెంచుటకు కావలసిన శక్తిని ఒక కాలరీగా పరిగణిస్తారు. ఆహార పదార్థాల విషయములో శక్తిని కిలో కాలరీలలో ( 1 కిలో కాలరీ = 1000 కాలరీలు ) వ్యక్తపరుస్తారు. వాడుకలో కాలరీలన్నా వాస్తవానికి అవి కిలో కాలరీలుగా అర్థము చేసుకోవాలి.

ఓక గ్రాము కొవ్వు పదార్థాలలో సుమారు 9 కాలరీల ( కిలో కాలరీలు) శక్తి నిగూఢమై ఉంటుంది. ఓక గ్రాము పిండిపదార్థాలు, మాంసకృత్తులలో సుమారు 4 ( కిలో ) కాలరీలు ఉంటాయి. దైనందిక అవసరాలకు మించి తీసుకున్న ఆహారపదార్థాలు శరీరపు పెరుగుదలకు, బరువు పెరుగుటకు

325 ::