పుట:Hello Doctor Final Book.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

temperature ) 101 - 104 ఫాహ్రెన్ హైట్ ( 38.3 - 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ) వఱకు చేరవచ్చును. వీరు నిలుచున్నప్పుడు రక్తపీడనము బాగా పడిపోవచ్చును ( postural hypotension ). వీరి మానసికస్థితి మాత్రము మాఱదు. మతిభ్రంశము కలిగితే, శరీర ఉష్ణోగ్రత ఎంత ఉన్నా సరే దానిని వడదెబ్బగానే (ఉష్ణఘాతము : Heat stroke ) పరిగణించాలి.

వడబడలిక అయినా, వడదెబ్బ అయినా సంశయము కలిగినపుడు శరీరాంతర ఉష్ణోగ్రతను త్వరగా తగ్గించు ప్రయత్నములు చేయాలి. రోగులను చల్లని ప్రదేశములకు చేర్చాలి. అధిక వస్త్రములను తొలగించాలి. చల్లని నీటి తుంపరలతోను, పంకాలతోను శారీరక ఉష్ణోగ్రతను 101 ఫాహ్రెన్ హైట్ డిగ్రీలకు తగ్గించు ప్రయత్నము చేయాలి. నోటిద్వారా గాని, సిరలద్వారా గాని లవణసహిత ద్రవపదార్థములను ఇచ్చి శోషణ ( dehydration ) తగ్గించాలి. వెల్లకిల పడుకోబెట్టి కాళ్ళను ఎత్తుగా ఉంచాలి. వీరికి సంపూర్ణ రక్తకణ పరీక్షలు, జీవవ్యాపార రక్తపరీక్షలు (విద్యుద్వాహక లవణములు సోడియమ్, పొటాసియమ్, క్లోరైడు, బైకార్బొనేటులు; గ్లూకోజ్,యూరియా నైట్రొజెన్, క్రియటినిన్, కాలేయవ్యాపార పరీక్షలు, రక్తములో మయోగ్లోబిన్ (myoglobin ), మూత్రపరీక్షలు, రక్త ఘనీభవన పరీక్షలు ( blood coagulation tests ) చేయాలి.

అధిక ఉష్ణోగ్రతల వద్ద జీవోత్ప్రేరకములు (enzymes), యితర మాంసకృత్తులు వికృతి పొందే (denature) అవకాశము, కణజాలము విధ్వంసము పొందే అవకాశము ఉన్నాయి. అస్థికండర కణవిధ్వంసము ( rhabdomyolysis ) జరిగి కండరములనుంచి మయోగ్లోబిన్ అనే వర్ణకము ( pigment) విడుదల కావచ్చును.

విద్యుద్వాహక లవణములలో తేడాలు (electrolyte imbalance), అస్థికండర కణవిధ్వంసము (rhabdomyolysis). కాలేయకణ విధ్వంసము ( hepatocellular injury ), మూత్రాంగవైఫల్యము (renal failure) వంటి ఉపద్రవములు కలిగే అవకాశములు ఉన్నాయి. అట్టి పరిణామములను గమనించి వాటికి తగిన చికిత్స చేయాలి.

319 ::