పుట:Hello Doctor Final Book.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎక్కువయినపుడు దేహములో ప్రసరణ రక్తప్రమాణము ( circulating blood volume ) తగ్గుతుంది. శరీరములో జల లవణముల ప్రమాణము తగ్గి శోషణ ( dehydration ) కలుగుతుంది. దేహములో జనించు ఉష్ణము ఉష్ణనష్టము కంటె అధికమయినపుడు శరీరాంతర ఉష్ణోగ్రత ( core body temperature ) క్రమముగా పెరుగుట మొదలవుతుంది. అధిక ఉష్ణ ముచే కలుగు స్వల్ప అస్వస్థ తలు : వడ పొంగు ( Heat edema ) :

శరీర ఉష్ణము పెరుగుట వలన కాళ్ళలో రక్తనాళములు వ్యాకోచము చెంది, రక్తసాంద్రత పెరిగి  కాళ్ళలోను పాదముల లోను పొంగులు కనిపించవచ్చును. చల్లని ప్రదేశములలో కాళ్ళను ఎత్తుగా పెట్టి పడుకుంటే యీ పొంగులు తగ్గిపోతాయి. మూత్రకారకములను (diuretics) యీ పొంగులకు వాడకూడదు. కండరముల పీకులు, నొప్పులు ( Muscle cramps ) :

పరిసరముల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు క్రీడలు, వ్యాయామము, శ్రమజీవనముల వలన కండరములలో పీకులు, నొప్పులు కలుగవచ్చును. ఉదర కుడ్యపు కండరములు (abdominal wall muscles), ఊరు కండరములు (quadriceps muscles of thighs), కాలిపిక్కల కండరములలో (gastrocnemius muscles) యీ నొప్పులు సాధారణముగా కలుగుతాయి. జల, లవణ నష్టములే కాక నాడీ కండర ప్రేరేపణలు (neuromuscular stimuli) యీ నొప్పులకు కారణము కావచ్చును. చల్లని ప్రదేశములలో విశ్రాంతి, లవణసహిత ద్రవపానములు, మర్దనములతో యీ పీకులను నివారించగలము. చెమట పొక్కులు ; చెమట కాయలు (Heat rash ) :

ఎండలు, వేడి ఎక్కువయినపుడు చెమట ఎక్కువగా పడుతుంది. స్వేద రంధ్రములు పూడుకొనిపోతే చెమట స్వేద నాళములలో యిరుక్కొని ఎఱ్ఱని చెమట కాయలు, పొక్కులు, చీముకాయలు (Pustules) ఏర్పడుతాయి.

317 ::