పుట:Hello Doctor Final Book.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాల్సిటోనిన్ ( Calcitonin ) :  కాల్సిటోనిన్ ఎముకల శిధిలతను (resorption) మందగింపజేస్తుంది. దినమునకు ఒక ప్రక్క చొప్పున మారుస్తూ ముక్కులో తుంపరులుగా కాల్సిటోనిన్  వాడుతారు. ఇతర ఔషధములు వాడలేని వారిలో కాల్సిటోనిన్ వాడుతారు. బైఫాస్ఫొనేటులు కలుగజేసినంత ప్రయోజనమును కాల్సిటోనిన్ కలుగజేయదు. డెనోసుమాబ్ (Denosumab) :   డెనోసుమాబ్ ఒక ఏకరూపక ప్రతిరక్షకము (monoclonal antibody). ఇది అస్థిశిథిల కణముల (osteoclasts) చైతన్యమును నిరోధించి ఎముకల శిథిలతను (bone resorption) తగ్గించి అస్థిసాంద్రతను పెంచుతుంది. దీనిని చర్మము కింద సూదిమందుగా ఆరుమాసములకు ఒకసారి ఇస్తారు. ఇది ఋతుస్రావములు తప్పిన (post menopausal) గుల్ల ఎముకల వ్యాధిగ్రస్థులైన స్త్రీలలో  వెన్నెముక, తుంటె ఎముకల విఱుగుటలు (fractures) తగ్గిస్తుంది.

గుల్ల ఎముకల వ్యాధిగ్రస్థులైన స్త్రీ, పురుషులు, గుల్ల ఎముకల వ్యాధి కలిగే అవకాశములు ఎక్కువగా ఉన్నవారు, ఇతర మందులు సహించలేనపుడు, లేక  ఇతర మందుల వలన ప్రయోజనము పొందనపుడు డెనోసుమాబ్ వాడుతారు. డెనోసునాబ్ రక్తపు కాల్సియమ్ ప్రమాణాలను తగ్గించే అవకాశము ఉన్నది కావున కాల్సియమ్ విలువలను పరిశీలిస్తూ, కాల్సియమ్ లోపములను సరిదిద్దుతు ఉండాలి.

పర్యవేక్షణ : గుల్ల ఎముకల వ్యాధి కలవారికి తగిన చికిత్స అందజేస్తూ సంవత్సరము, రెండు సంవత్సరములకు ఒకసారి వారి అస్థిసాంద్రతను DEXA Scan తో గమనిస్తూ ఉండాలి.

315 ::