పుట:Hello Doctor Final Book.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సిరల ద్వారా ఇచ్చుటకు ఐబాన్డ్రొనేట్ (Ibandronate, మూడు మాసములకు ఒకసారి ఇస్తారు), జొలెన్డ్రొనేట్ (Zolendronate) సంవత్సరమునకు ఒకసారి ఇస్తారు.) మందులు లభ్యము.  

ఎముకలకు వ్యాపించిన కర్కట వ్రణములు (metastatic bone cancers) కలవారిలో   బైఫాస్ఫొనేటులు వాడినపుడు  దవడ ఎముక శిధిలమయే (osteonecrosis) అవకాశము ఉన్నది.

రలోక్సిఫీన్ (Raloxifene) :    రలోక్సిఫీన్ ఎష్ట్రొజెన్ గ్రాహకములను (estrogen receptors) సవరించు ఔషధము. ఎముకలలో ఇది ఎష్ట్రొజెన్ కు అనుకూలముగాను, స్తనములు, గర్భాశయములపై ఎష్ట్రొజెన్ కు ప్రతికూలముగాను పనిచేస్తుంది. ఇది ఎముకల సాంద్రత పెంచుటకు ఉపయోగపడుతుంది. బైఫాస్ఫొనేటులు తీసుకోలేని వారికి ఈ మందు ఉపయోగకరము. ఈ ఔషధము వలన రక్తనాళములలో రక్తపుగడ్డలు (thrombosis) ఏర్పడే అవకాశము ఉన్నది.

ఎష్ట్రొజెన్ లు (estrogens) గుల్ల ఎముకల వ్యాధిని అరికట్టగలిగినా వాటిని వాడిన వారిలో హృద్రోగములు, మస్తిష్క విఘాతములు (cerebrovascular accidents), నిమ్నసిరలలో రక్తపుగడ్డలు (deep vein thrombosis) కలిగే అవకాశములు  హెచ్చగుట వలన ఎష్ట్రొజెన్ల వాడుక పోయింది.

టెరిపెరటైడ్ (Teriparatide) :    టెరిపెరటైడ్ ఒక సహగళగ్రంథి స్రావక సమధర్మి (parathyroid hormone analog). ఇది అస్థి నిర్మాణ కణములను (osteoblasts) అస్థిశిథిల కణముల (osteoclasts) కంటె ఎక్కువగా ఉత్తేజపఱచి అస్థి నిర్మాణమును పెంచుతుంది. టెరిపెరటైడ్ వాడుక వలన ఎముకల  సాంద్రత పెరుగుతుంది. గుల్ల ఎముకల వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలోను, మిగిలిన ఔషధములు  తీసుకోలేని వారిలోను దీనిని వాడుతారు. టెరిపెరటైడ్ ని చర్మము క్రింద సూదిమందుగా దినమునకు ఒకసారి చొప్పున 18 నెలల వఱకు ఇస్తారు. ఎక్కువ కాలము వాడేవారిలో ఎముకలలో ప్రమాదకరమైన పెరుగుదలలు (malignant growths) కలిగే అవకాశము ఉండుట వలన 18 మాసములకు మించి దీనిని వాడరు.

314 ::