పుట:Hello Doctor Final Book.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విటమిన్ డి లోపము హెచ్చుగా ఉన్నవారికి హెచ్చు మోతాదుల విటమిన్ డి అవసరము. సూర్యరశ్మి సోకేవారి చర్మములో విటమిన్ డి ఉత్పత్తి కొంత జరుగుతుంది.

వ్యాయామము  : చేయగలిగేవారు తగినంత వ్యాయామము చేయాలి.

ఔషధములు :    అస్థిసాంద్ర క్షీణత కలవారిలో డెక్సా టి విలువ (DEXA T Score) -2 కంటె తక్కువ ఉన్నవారిలోను ;

బలహీనులలోను, అదివఱకు తుంటి ఎముక, వెన్నుపూసలు విఱిగిన వారిలోను DEXA T Score -1.5  కంటె తక్కువ ఉంటే ఎముకలు విఱుగుట (fractures) అరికట్టుటకు ఔషధ చికిత్స అవసరము.

బై ఫాస్ఫొనేటులు ( Biphosphonates ) :

గుల్ల ఎముకల వ్యాధి కలవారిలో బైఫాస్ఫొనేటులు ఎముకలు విఱుగుటను (fractures) 30-60 శాతము వఱకు తగ్గిస్తాయి. ఇవి ఎముకల నుంచి కాల్సియమ్ సంగ్రహణము (absorption) అరికట్టి ఎముకల శిథిలమును (bone resorption) మందగింపచేస్తాయి.

ఎలెన్డ్రోనేట్  (Alendronate), రిసెడ్రొనేట్ (Risedronate), ఐబాన్డ్రొనేట్ (Ibandronate) నోటి ద్వారా తీసుకుందుకు అందుబాటులో ఉన్నాయి.

ఈ బైఫాస్ఫొనేటులను ఉదయము నిద్ర లేచాక ఖాళీ కడుపుతో  240 మి.లీ ( 8 ఔన్సులు ) మంచినీళ్ళతో తీసుకోవాలి. తర్వాత 30 నిమిషముల వఱకు ఆహారము, యితర పానీయములు తీసుకోరాదు. మందు తీసుకున్నాక 30 నిమిషములు నిటారు స్థితిలో ఉండాలి. అలా ఉండకపోతే మందు అన్ననాళిక లోనికి తిరోగమనము చెంది అక్కడ తాపము (esophagitis), వ్రణములు (esophageal ulcers) కలిగించవచ్చును. ఈ మందులతో పాటు కాల్సియమ్, విటమిన్ డి లు ఆహారముతో అదనముగా ఇవ్వాలి.

ఈ మందులు దీర్ఘకాల మూత్రాంగ వైఫల్యము కలవారిలోను, అన్ననాళ వ్యాధులు (esopgageal diseases)  గలవారిలోను వాడకూడదు.

313 ::