పుట:Hello Doctor Final Book.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పళ్ళెములవలె ఉంటాయి. ఒక్క ఎఱ్ఱకణపు పరిమాణము సుమారు 90 ఫెంటొ లీటర్లు (fl)g ( ఒక ఫెంటో femto అంటే 0.000 000 000 000 001) కలిగి ఉంటుంది. రక్తకణాలు ఎముకల మజ్జలో (Bone marrow) ఉత్పత్తి అవుతాయి. ప్రారంభదశలో ఎఱ్ఱకణాలలో న్యూక్లియస్లు ఉన్నా, పరిణామము చెందుతూ అవి న్యూక్లియస్ లను కోల్పోతాయి. అందువలన వాటిలో ఎక్కువగా హీమోగ్లోబిన్ నిక్షిప్తము అయే అవకాశము ఉంటుంది. పరిణామము చెందుతున్న దశలో న్యూక్లియస్ తొలగినా ఎఱ్ఱకణాలలో రైబోసోమల్ ఆర్. ఎన్. ఎ జల్లెడ కలిగి (Ribosomal RNA reticulum), ఆ జాలికకణాలు (Reticulocytes) క్రమేణా ఆ జాలికను కూడా కోల్పోతాయి. ప్రసరణలో ఉన్న ఎఱ్ఱకణాలలో న్యూక్లియస్లు ఉండవు. కాని ప్రసరణలో సుమారు ఒక శాతపు జాలికకణాలు ఉంటాయి. రక్తనష్టము జరిగినప్పుడు ఎఱ్ఱకణాల ఉత్పత్తి అధికము, త్వరితము అయి పరిణతి చెందని కణాలు ప్రసరణములోనికి విడుదల అయి జాలికకణాల శాతము పెరుగుతుంది . పరిణతి చెందిన కణాలు పరిణతి చెందని కణాల కంటె చిన్నవిగా ఉంటాయి. ఎక్కువ పరిమాణము గల కణాలు ప్రసరణలో ఉంటే పృథుకణత్వము అని (Macrocytosis), తక్కువ పరిమాణము కల కణాలు ప్రసరణలో ఉంటే  లఘుకణత్వము (Microcytosis) అని అంటారు. సామాన్య పరిమాణ కణాలు ప్రసరణలో ఉంటే సామాన్య కణత్వము (Normocytosis) అని అంటారు.

ఎఱ్ఱరక్తకణాలలో ఉండే రక్తవర్ణకము (hemoglobin) వలన వాటికి ఎఱుపు రంగు వస్తుంది. రక్తవర్ణకము వలన ఎఱ్ఱకణాలు ప్రాణవాయువును వహించగలుగుతాయి. రక్తవర్ణకము (hemoglobin) సాధారణముగా డెసి లీటరు రక్తములో పురుషులలో 13- 14 గ్రాములు, స్త్రీలలో 12- 13 గ్రాములు ఉంటుంది. హీమోగ్లోబిన్ సాధారణ పరిమితి కంటె తక్కువయితే దానిని రక్తహీనముగా (Anemia; పాండురోగము) పరిగణిస్తారు. రక్తమును ఒక పరీక్షనాళికలో ఉంచి వికేంద్రీకరణ యంత్రములో (Centrifuge) వడిగా తిప్పుతే కణాలన్నీ క్రిందకు పేరుకొని రక్తద్రవము (Plas:: 296 ::