పుట:Hello Doctor Final Book.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27. పాండురోగము ( Anemia ) జంతుజాలములోను, పక్షులలోను, జలచరములలోను జీవన వ్యాపారమునకు రక్తప్రసరణము మూలాధారము. రక్తప్రసరణము వలన వివిధ కణజాలమునకు ప్రాణవాయువు ( Oxygen ), పోషకపదార్థములు చేర్చబడుతాయి. కణజాలము నుంచి బొగ్గుపులుసువాయువు (cabon dioxide), తదితర వ్యర్థపదార్థములు గ్రహింపబడి ఊపిరితిత్తులకు (Lungs), కాలేయమునకు (Liver), మూత్రాంగములకు (Kidneys) విసర్జన కొఱకై చేర్చబడుతాయి. హృదయము వివిధ అరల సంకోచ వ్యాకోచముల వలన రక్తమును గ్రహించి, మరల ఆ రక్తమును వివిధ అవయవములకు సరఫరా చేస్తుంది. హృదయము ఒక తోడుయంత్రము. రక్తనాళముల ద్వారా రక్తప్రసరణము జరుగుతుంది. రక్తములో ఎఱ్ఱకణాలు (Red Blood Corpuscles), తెల్లకణాలు (White Blood Cells), రక్తఫలకములు (Platelets), రక్తద్రవములో (Plasma)  కలిసి ఉంటాయి. ఇతర పోషకపదార్థములు, మాంసకృత్తులు, చక్కెర, క్రొవ్వుపదార్థములు, వినాళగ్రంథుల స్రావములు (Hormones) యితర రసాయనములు రక్తద్రవములో కరిగి ఉంటాయి. ఎఱ్ఱకణములు ప్రాణవాయువును  కణజాలమునకు చేర్చుటకు, కణజాలమునుంచి బొగ్గుపులుసువాయువును ఊపిరితిత్తులకు విసర్జనకు కొనిపోవుటకు, ఊపిరితిత్తులలో ప్రాణవాయువును గ్రహించుటకు ఉపయోగపడుతాయి. ఎఱ్ఱకణములు ( Red blood corpuscles )

ప్రాణవాయువు వాహక సమర్థత (Oxygen carrying capacity) ఎఱ్ఱకణాలు, ఆ కణాలలో ఇమిడిఉన్న హీమోగ్లోబిన్ అనే వర్ణకము (Pigment) యొక్క పరిమాణములపై ఆధారపడి ఉంటుంది. సాధారణముగా ఒక క్యూబిక్ మిల్లీమీటరు రక్తములో స్త్రీలలో 4-5 మిల్లియన్లు, పురుషులలో 5-6 మిల్లియన్ల ఎఱ్ఱకణాలు ఉంటాయి. ఎఱ్ఱకణాలు కోలగా ద్విపుటాకారపు

295 ::