పుట:Hello Doctor Final Book.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంప్రదించి, వాటిని శస్త్రచికిత్సచే తొలగించుకొని వాటికి కణ పరీక్ష (Biopsy) చేయించుకోవాలి.  స్త్రీలు కనీసము నెలకు ఒకసారైనా  వారి రొమ్ములను స్వయముగా పరీక్షించుకోవాలి. అనుమానాస్పదమైన పెరుగుదలలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలి. స్తనచిత్రీకరణలు (Mammograms) రొమ్ములోని కర్కటవ్రణములను సత్వరముగ కనుగొనుటకు తోడ్పడుతాయి. నలభైనుంచి డెబ్భై సంవత్సరముల వయస్సులో ఉన్న స్త్రీలకు ఈ పరీక్షలు  ప్రతి రెండు లేక మూడు సంవత్సరములకు ఒక పర్యాయము వైద్యులు సూచిస్తారు. పురుషులు వారి వృషణములను నెలకు ఒకసారైనా పరీక్షించుకోవాలి.

గర్భాశయముఖ కర్కటవ్రణములు కొన్ని హ్యూమన్ పాపిల్లోమేటస్ విషజీవాంశములు (Human papilloma viruses) వలన కలుగుతాయి. హెచ్.పి.వి (HPV Vaccine) టీకాలను పిల్లలకు వేసి ఈ పుట్టకురుపులను నివారించవచ్చు. ఇరవై సంవత్సరాల నుంచి అరవైయైదు సంవత్సరముల వయస్సు గల స్త్రీలలో గర్భాశయముఖము నుంచి పాప్ స్మియర్ తో (Pap smear) గ్రహించిన కణముల పరీక్షలను ( Pap Smears ) సంవత్సరమునకు ఒకసారి వైద్యులు సిఫారసు చేస్తారు. ఈ పరీక్షలు  కర్కటవ్రణములను తొలిదశలలో కనుగొందుకు ఉపయోగపడుతాయి. ఉత్తర అమెరికాఖండములో వైద్యులు ఏభై సంవత్సరములు నిండిన వారికి బృహదంత్ర (పెద్దప్రేవుల) అంతర్దర్శన పరీక్షలను (Colonoscopies) ప్రతి ఐదు పది సంవత్సరములకు ఒకసారి సూచిస్తారు. ఈ పెద్దప్రేవుల అంతర్దర్శన పరీక్షలు చేసినప్పుడు పాలిప్స్ (Polyps) అనే అంగుష్టాకారపు కంతులు కనిపిస్తే వాటిని సమూలముగా విద్యుద్దహన చికిత్సతో (Electro cauterization) తొలగించి కణపరీక్షకు పంపిస్తారు. ఈ కంతులు తొలిదశలలో  నిరపాయకరమైన బోళాగడ్డలైనా (benign tumors) తరువాత అపాయకరమైన కర్కటవ్రణములుగా పరిణామము చెందవచ్చు. ఈ నిరపాయకరమైన ఆంత్రపు పెరుగుదలలను తొలగించుటచే వైద్యులు అపాయకరమైన కర్కటవ్రణములను నివారించగలుగుతారు. తొలిదశలలో కనుక్కోబడిన పెద్దప్రేవుల కర్కటవ్రణములు (Colon cancers) చికిత్సలకు సాధారణముగా

292 ::