పుట:Hello Doctor Final Book.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూస్తాము. ఈ వ్యాధి బొర్రీలియా సూక్ష్మజీవుల వలన కలుగుతుంది. వీరిలో ప్రథమదశలో  ఎద్దుకన్ను (Bull eye) రూపములో చర్మముపై  ఎఱ్ఱని దద్దురు కనిపిస్తుంది. శరీరములో అనేక లక్షణాలు కలిగించే యీ వ్యాధి వలన కొందఱిలో ముఖనాడి పక్షవాతము  కలుగుతుంది. లేడి పురుగులు (deer ticks)  కుట్టుట వలన యీ వ్యాధి సంక్రమిస్తుంది. వీరిలో కొందఱికి  రెండు పక్కలా ముఖపక్షవాతము కలుగవచ్చును. ఇతర కపాలనాడులలోను, నాడీమండలములో యితర భాగములలోను రుగ్మత లక్షణములు ఉన్నపుడు, ముఖపక్షవాత చిహ్నములు మూడువారములలో ఉధృతమయినా, నాలుగువారములలో తగ్గుదల చూపకపోయినా, యితర వ్యాధులకు పరిశోధించాలి.

మస్తిష్క విఘాతములను (Cerebro vascula accidents), కొత్త పెరుగుదలలను (new growths), సూక్ష్మాంగజీవ వ్యాధులను కనుగొనుటకు గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణములు (Computerized Axial Tomography), అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణములు (Magnetic Resonance Imaging Scans) అవసరము. మధ్యచెవిలో సూక్ష్మజీవుల వలన తాపము ( Otitis media ) కలిగిన వారిలో చెవినొప్పి, చెవినుంచి స్రావము కారుట వంటి లక్షణములతో ముఖపక్షవాతము కలుగవచ్చును. వారికి చెవి తాపమునకు చికిత్స, వారి మధ్యచెవిలో తాపము వలన Cholesteotoma అనే పెరుగుదల ఏర్పడితే  దానికి శస్త్రచికిత్స అవసరము. మస్తిష్క రక్తనాళ విఘాతముల (Cerebro vascular accidents) వలన కలిగే స్పర్శనష్టము, చలననష్టము ముఖము లోనే గాక ఆ పక్క చేతులలోను, కాళ్ళలోను కూడా కనిపిస్తాయి. వీరిలో లలాటభాగములో వాతపు లక్షణములు రెండవ పక్క ముఖనాడి తంతులు కొన్ని ఈవల లలాట కండరమునకు ప్రసరణ చేయుట వలన తీవ్రముగా ఉండవు. నుదుటిలో ముడుతలు పూర్తిగా పోవు.

276 ::