పుట:Hello Doctor Final Book.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లక్షణములు కనిపించకపోతే రక్తస్రావము (hemorrhage) జరుగలేదని నిర్ధారణ చేసి రక్తము గడ్డకట్టుటను (thrombosis) నివారించు చికిత్సలు మొదలుపెట్టవచ్చును. అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణములో (Magnetic Resonance Imaging) మస్తిష్క విఘాతములు త్వరగానే కనిపిస్తాయి. కాని రోగిని పరీక్షించినపుడు మస్తిష్క విఘాత లక్షణములు స్పష్టముగా కనిపించినపుడు  MRI Scan వలన ఎక్కువ ప్రయోజనము లేదు. అయస్కాంత ప్రతిధ్వని రక్తనాళ చిత్రీకరణములతో (Magnetic Resonance Angiogram) మెదడులో రక్త నాళములను పరీక్షించ వచ్చును.

శ్రవణాతీత ధ్వని చిత్రీకరణముతో (ultrasonography) కంఠ ధమనులను పరీక్షిస్తే కంఠధమని సంకుచితములు (carotid artery stenosis) పసిగట్టవచ్చును. హృదయ  ప్రతిధ్వని చిత్రీకరణముతో (echocardiogram) హృదయములో రక్తపుగడ్డలను, కవాటములపైన మొలకలను {vegetations ; సూక్ష్మజీవులు గుండె లోపొరను ఆక్రమించి వృద్ధి పొంది హృదయాంతర తాపము (endocarditis) కలుగ జేస్తే యీ మొలకలు కనిపిస్తాయి. ఇవి విచ్ఛిన్నమయి రక్తప్రవాహములో అవరోధకములు ( emboli) కలుగజేయగలవు.}, కవాటముల సంకోచమును (valvular stenosis), కవాటములలో తిరోగమన ప్రవాహములను (regurgitation), గుండె మధ్య కుడ్యములో రంధ్రములను (విభాజన రంధ్రములు ; septal defects) కనుగొనవచ్చును.

మస్తిష్క ధమనీ చిత్రీకరణ (cerebral angiogram) : కంఠధమని ద్వారా వ్యత్యాసపదార్థములను (contrast materials) ఎక్కించి మెదడులో ధమనులను ఎక్స్ రేలతో చిత్రీకరించవచ్చును. ధమనులలో బుడగలను (aneurysms), ధమనీ వైకల్యములను (arterial malformations) యీ చిత్రములతో కనుగొనవచ్చును.

264 ::