పుట:Hello Doctor Final Book.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మస్తిష్కవిఘాతమును పోలు ఇతర వ్యాధులు

పార్శ్వపు తలనొప్పి (migraine headache) కలిగినపుడు చలనలోప, స్పర్శలోపముల వంటి నాడీమండల లక్షణాలు తాత్కాలికముగా పొడచూపవచ్చును. మూర్ఛరోగము (seizure) కలిగినపుడు తాత్కాలిక పక్షవాత లక్షణములు కలుగవచ్చును. రక్తములో చక్కెర (glucose) విలువలు బాగా తగ్గినపుడు అపస్మారకస్థితి, నీరసము  కలిగి పక్షవాతమును అనుకరించవచ్చును. పరీక్షలు

మస్తిష్క విఘాత లక్షణములు కనిపించిన వారికి ప్రాథమిక రక్తపరీక్షలు అవసరము. వివిధ రక్తకణముల గణనములు (complete blood counts), రక్తఫలకముల లెక్కింపు (Platelet count), రక్తము గడ్డకట్టు సమయ పరీక్షలు (Protime / INR, Partial Thromboplastin Time), చక్కెర (glucose), విద్యుద్వాహక లవణములు (electrolytes) పరీక్షలు చేయాలి. విద్యుత్ హృల్లేఖ (electrocardiograph) వలన గుండె లయలో మార్పులు, ఇతర హృదయ విలక్షణములు తెలుస్తాయి. మస్తిష్క విఘాత లక్షణములు పొడచూపిన వారికి త్వరగా వ్యత్యాస పదార్థములు (contrast materials) ఇవ్వకుండ మెదడుకు గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణము (Computerized Axial Tomography  with out contrast materials) చెయ్యాలి. ఈ పరీక్షలో మెదడు కణజాలములో రక్తస్రావము (intraparenchymal hemorrhage), ఎరఖ్ నాయిడ్ పొర క్రింద రక్తస్రావము (subarachnoid hemorrhage) ఉంటే త్వరగానే కనిపిస్తాయి.

రక్తపుగడ్డలు (thrombi), రక్తనాళ అవరోధక పదార్థములు (emboli) కలిగించు రక్తప్రసరణ లోపము ( ischemia ) వలన కలిగే మస్తిష్క విఘాతములు ఈ చిత్రీకరణలలో కనిపించుటకు 48 నుంచి 72 గంటలు పట్టవచ్చును. గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణములో రక్తస్రావపు (hemorrhage)

263 ::