పుట:Hello Doctor Final Book.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పలుకులో తొట్రుపాటు (dysarthria) రావచ్చును. జ్ఞానేంద్రియాలు అందించిన సమాచారము మెదడు గ్రహించలేకపోతే, వస్తువులను, తెలిసిన మనుష్యులను, శబ్దములను, వాసనలను, రుచులను గుర్తుపట్టలేని స్థితి (agnosia) కలుగవచ్చును.

రక్తప్రసరణ దోషము వెన్నుధమని (vertebral artery), మూలధమని (basilar artery) శాఖలలో ఉంటే, దేహములో ఒకపక్క గాని లేక  రెండుపక్కలా గాని చలననష్టము (loss of motor function), స్పర్శనష్టము (sensory loss) కలుగుటయే కాక తలతిప్పుట (vertigo), కళ్ళుతిరుగుట, దేహమునకు అస్థిరత (ataxia), ద్విదృష్టి (diplopia -  ఒక వస్తువు రెండుగా కనిపించుట) కలుగవచ్చును.

గుండె లయలో (rhythm) అసాధారణలు, మర్మర శబ్దములు (murmurs), కంఠధమనులలో హోరుశబ్దములకై (bruits) వైద్యులు పరీక్ష చేస్తారు.

మెదడు కణజాలములో రక్తస్రావము (hemorrhage) జరిగినపుడు చలననష్టము, స్పర్శనష్టము వంటి  నాడీమండల వ్యాపార లోపములతో బాటు తీవ్రమైన తలనొప్పి, వాంతులు, మాంద్యము (lethargy), అపస్మారకము కూడా కలుగవచ్చును.

ఎరఖ్ నాయిడ్ పొర క్రింద రక్తస్రావము (subarachnoid hemorrhage) కలిగి నపుడు జీవితములో ఎన్నడూ కలుగనంత  తీవ్రమైన తలనొప్పి కలుగుతుంది. వాంతులు, మూర్ఛ, చేతులలోను, కాళ్ళలోను కంపనము (seizures), జ్వరము, నడుమునొప్పి, మాంద్యము (lethargy) లేక అపస్మారకము కూడా కలుగవచ్చును. సిరాపరిఖలలో రక్తపుగడ్డలు (cerebral venous sinus thrombosis) ఏర్పడినచో తలనొప్పి, మసకచూపు, దృష్టిబింబములో పొంగు (papilloedema) వంటి  కపాలములో ఒత్తిడి పెరిగిన లక్షణములు కనిపిస్తాయి.

262 ::