పుట:Hello Doctor Final Book.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చలనవల్కలములో (motor cortex) నాడీకణములను ఊర్ధ్వ చలన నాడీకణములుగా (upper motor neurons) పరిగణిస్తారు. వీని నుంచి వెలువడు అక్షతంతులు (axons) మెదడులో క్రిందకు సాగుచు ఆంతరగుళిక (internal capsule) అను భాగములో గుమికూడి ఆపై మస్తిష్కమూలమునకు (brain stem) చేరుతాయి.  ఈ అక్షతంతులు రెండవప్రక్కకు దాటుకొని కపాలనాడుల కేంద్రములలో ఉన్న  అధశ్చలన నాడీకణములతోను (lower motor neurons of cranial nerve nuclei), వెన్నుపాములోని అధశ్చలన నాడీకణములతోను (lower motor neurons of spinal cord) సంధానము అవుతాయి. కపాలనాడుల కేంద్రములలో అధశ్చలన నాడీకణముల నుంచి వెలువడు అక్షతంతులు (axons) కపాలనాడుల (cranial nerves) ద్వారాను, వెన్నుపాములోని అధశ్చలన నాడీకణముల అక్షతంతులు వెన్నునాడుల (spinal nerves) ద్వారాను పయనించి వివిధ కండరములకు చేరుకుంటాయి.

మధ్యగర్తమునకు (central sulcus) వెనుక పార్శ్వభాగములో (parietal lobe) జ్ఞానవల్కలము (sensory cortex) ఉంటుంది.

257 ::