పుట:Hello Doctor Final Book.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శరీరములో వివిధభాగముల నుంచి జ్ఞాననాడులు సమీకరించే స్పర్శ, కంపనము (vibration sense), నొప్పి, ఉష్ణోగ్రత జ్ఞాన సంజ్ఞలు మెదడులో థలమస్ (thalamus) లకు ఆపై జ్ఞానవల్కలములకు చేరుట వలన ఆయా జ్ఞానములు కలుగుతాయి. కుడి జ్ఞానవల్కలము వలన శరీరపు ఎడమ భాగములో స్పర్శాది జ్ఞానములు, ఎడమ జ్ఞానవల్కలము వలన శరీరపు కుడి భాగములో స్పర్శాది జ్ఞానములను పొందుతాము.

మెదడు కర్ణభాగములలో (temporal lobes) శ్రవణ వల్కలములు (auditory cortices) ఉంటాయి. వినికిడి, వినిన పదములను, భాషణములను అర్థము చేసుకొనుట ఈ శ్రవణవల్కలముల వలన కలుగుతుంది. దృశ్య సంజ్ఞల బట్టి చూసిన వస్తువులను గుర్తుపట్టుట, దీర్ఘకాల జ్ఞాపకము కూడ మస్తిష్కములోని కర్ణభాగముల వలన కలుగుతాయి.

మెదడు పృష్ఠభాగములలో (occipital lobes) దృష్టి వల్కలములు (visual cortices) ఉంటాయి. కంటి తెరలపై ( Retinas) నుంచి వచ్చే సంజ్ఞలను బోధ చేసుకొని దృష్టి వల్కలములు దృష్టిజ్ఞానమును కలుగజేస్తాయి.

వాక్కు మెదడులో వివిధ భాగములపైన ఆధారపడి ఉన్నా మెదడులో బ్రోకా ప్రాంతముగా (Broca’s area)  పరిగణించబడే లలాటభాగపు  (frontal lobe) వెనుక క్రిందిభాగము పలుకులు పలుకుటలో ప్రముఖపాత్ర నిర్వహిస్తుంది. చిన్నమెదడు (cerebellum) చలన ప్రక్రియలను సమన్వయ పఱచుటకు (coordination), శరీరమును సమస్థితిలో (balance) ఉంచుటకు తోడ్పడుతుంది.

258 ::