పుట:Hello Doctor Final Book.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూత్రాశయము, మూత్రద్వారముల మధ్యనుండు నియంత్రణ కండరము (sphincter) వలన మూత్రవిసర్జనపై మనకు ఆధీనత కలుగుతుంది. మూత్రాశయ కండరము (detrusor muscle) సంకోచించి, నియంత్రణ కండరపు బిగువు తగ్గుట వలన మూత్ర విసర్జన జరుగుతుంది.

మూత్రాంగములలో (kidneys) కణజాలము బహిర్భాగము (cortex), అంతర్భాగములుగా (medulla) గుర్తించబడుతుంది. అంతర్భాగము (medulla) గోపురములు  (pyramids) వలె అమర్చబడి ఉంటుంది. ఈ గోపురముల కొనలనుంచి మూత్రము గరాటు ఆకారములో ఉండు మూత్రకుండిక (మూత్రపాళియ ; Renal Pelvis) లోనికి కుండిక ముఖద్వారముల (calyces) ద్వారా చేరుతుంది. మూత్రకుండిక క్రమముగా సన్నబడి మూత్రనాళముగా మూత్రాంగము నుంచి బయల్వడుతుంది.

మూత్రాంగములలో మూత్రము మూత్రాంకములలో (nephrons) ఉత్పత్తి అవుతుంది. మూత్రాంకముల తొలిభాగములు మూత్ర ముకుళములు (Renal corpuscles). మూత్ర ముకుళములు మూత్రనాళికలుగా (renal tubules) కొనసాగుతాయి. ప్రతి మూత్రముకుళములోనికి ఒక సూక్ష్మ ప్రవేశికధమని (afferent arteriole) ప్రవేశించి, కేశరక్తనాళిక గుచ్ఛముగా (Glomerulus) ఏర్పడుతుంది. ఈ కేశనాళికల గుచ్ఛము నుంచి నిష్క్రమణధమని (efferent arteriole) ఏర్పడి మూత్రముకుళము నుంచి బయటకు వెలువడుతుంది. నిష్క్రమణ ధమనులు మూత్రనాళికల చుట్టూ మరల కేశనాళికలుగా చీలుతాయి. ఈ కేశనాళికలు కలిసి నిష్క్రమణ సిరలను (efferent venules) ఏర్పరుస్తాయి. నిష్క్రమణ సిరల కలయికచే మూత్రాంగసిర (renal vein) ఏర్పడుతుంది.

మూత్ర ముకుళము రెండు పొరల కణములను కలిగి ఉంటుంది. కేశనాళిక గుచ్ఛములలోని రక్తము మూత్రముకుళముల (Renal corpuscles) లోపలి పొర ద్వారా వడపోయబడుతుంది. గుండె నుంచి బృహద్ధమనికి (aorta) ప్రసరించు రక్తములో 20 శాతము మూత్రధమని ద్వారా మూత్రాంగములకు ప్రసరించి వడపోయబడుతుంది. వడపోత ద్రవము (Glomerular filtrate) మూత్రనాళికల (renal  tubules)

229 ::