పుట:Hello Doctor Final Book.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మద్యపానము వలన కలుగు సామాజిక దుష్ఫలితములు :- మద్య పానము సలిపి వాహనములు నడిపే వారి వలన వాహన ప్రమాదములు తఱచు జరుగుతాయి. మద్యపానము సలిపే వారి వలన జన సమూహములలో గొడవలు కలుగుతుంటాయి. మద్యపానము సలిపే వారి వలన సమాజములో నేరములు పెరుగుతాయి. వీరు హింసలో పాల్గొనవచ్చును, హింసల బారి పడవచ్చును. మద్యపాన వ్యసనము వలన వివాహములు చెడిపోతాయి.  గృహహింసలు అధికముగా జరుగుతాయి. వీరి పిల్లల సంరక్షణ దెబ్బతింటుంది. చాలా కుటుంబములు చితికిపోతాయి. వీరు ఉద్యోగ బాధ్యతలను సరిగా నిర్వహింపజాలరు. వీరు ఆర్ధిక యిబ్బందులకు లోనయే అవకాశములు ఎక్కువ. స్త్రీలు మద్యపానమునకు లోనయినప్పుడు వారు హింసకు, మానభంగములకు గుఱి అయే అవకాశములు హెచ్చు. ఇష్టము లేకుండా గర్భము తాల్చే అవకాశము కలదు. సత్వర మద్య పరిత్యజనము (Acute alcohol withdrawal) :-

దీర్ఘకాలము మద్యపానము చేయువారు ఒక్క సారిగా మద్యమును మానివేసినపుడు ఆందోళన, గడబిడ, కంపనము, మూర్ఛ (seizures), మతిభ్రంశము (delirium tremens), వంటి సత్వర పరిత్యజన లక్షణములు (acute withdrawl symptoms) పొడచూపే అవకాశము ఉన్నది. ఈ లక్షణములకు సత్వర విషహరణము (detoxification) అవసరము. మద్యపానము పరిత్యజించిన మూడు నుంచి ఆరు వారముల వరకు ఆందోళన, క్రుంగు (depression) నిద్రలేమి, నీరసము చాలామందిలో కలుగుతాయి. కొంతమందిలో ఆందోళన, క్రుంగుదల పెక్కు నెలలు కొనసాగే అవకాశము ఉన్నది.

అందు వలన వీరికి మానసిక వైద్యము, కుటుంబసభ్యుల, మిత్రుల సహాయ సహకారములు చాలా అవసరము. మద్యపరిత్యజన వలన కలిగే లక్షణములను ఎదుర్కొనలేక కొందఱు తిరిగి మద్యపానము మొదలు పెడతారు.

219 ::