పుట:Hello Doctor Final Book.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరిలో హృదయ ధమనీ వ్యాధులు (Coronary artery disease), హృదయవైఫల్యము (Congestive heart failure) కలిగే అవకాశములు ఎక్కువ. వీరిలో  థయమిన్ విటమిన్ లోపము (thiamine deficiency) వలన బెరిబెరీ (Beriberi) వ్యాధి కూడా కలిగే అవకాశము ఉన్నది. అంటు వ్యాధులు :

మితము తప్పి సారాయి త్రాగే వారిలో రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. వీరికి అంటురోగములు కలిగే అవకాశములు హెచ్చు మస్తిష్కముపై మద్యప్రభావము :-

సత్వర ప్రభావము :- రక్తములో మద్యప్రమాణముల బట్టి మస్తిష్కముపై వాటి ప్రభావము ఉంటుంది. రక్తములో మద్యప్రమాణము త్రాగిన మోతాదు పైనా,  త్రాగినపుడు జీర్ణాశయస్థితి పైన, వ్యక్తి వయస్సు, లింగము, ఆరోగ్యస్తు థి ల పైనా ఆధారపడుతుంది. ఖాళీ కడుపుతో మద్యము సేవించినపుడు అది త్వరగా రక్తములోనికి చేరుతుంది. స్త్రీల శరీరములలో కొవ్వు శాతము హెచ్చవుట వలన ఒకే మోతాదు త్రాగిన పురుషులలో కంటె, స్త్రీలలో రక్త మద్య ప్రమాణములు ఎక్కువగా ఉంటాయి. రక్త ము లోనికి చేరిన మద్యము కణజాలములోనికి సులభముగా ప్రవేశిస్తుంది. మద్యము మస్తిష్క కణములను మందగింపజేస్తుంది. తక్కువ ప్రమాణములలో మద్యము విశ్రాంతిని, ఉల్లాసభావమును కలిగిస్తుంది. ఆపై మాటలలో నియంత్రణ పోతుంది. ముఖము ఎఱ్ఱబారుతుంది. స్మృతి, ప్రజ్ఞ, విషయ గ్రహణశక్తి క్షీణిస్తాయి. మతిమఱపు కలుగుతుంది. చలన వ్యవస్థపై మందకొడి ప్రభావము వలన కండరముల సమన్వయము (coordination) తగ్గుతుంది. నడకలో పట్టు తగ్గి తూలుతుంటారు. మాటలలో తొట్రుపాటు కలుగుతుంది. స్పర్శజ్నఞా ము తగ్గుతుంది. రక్తములో మద్యప్రమాణములు యింకా ఎక్కువయినప్పుడు, మతిమఱపు పెరుగుతుంది. ఆపై మైకము, మత్తు పెరుగుతాయి. ఆపై అపస్మారకత కలుగుతుంది. హెచ్చు మోతాదులలో మద్యము సేవించిన వారిలో శ్వాసక్రియ మందగిస్తుంది. మస్కిష్క వ్యాపారము బాగా అణగినపుడు ప్రాణాపాయము కలుగుతుంది.

217 ::