పుట:Hello Doctor Final Book.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలిగినపుడు ఆ అలవాటును మద్యము దుర్వినియోగముగా (alcohol abuse) పరిగణించాలి.

మితము తప్పి మద్యము వినియోగించే వారిలో శారీరక, మానసిక, సామాజిక దుష్ఫలితములు కలుగుతాయి. శారీరక దుష్ఫలితములు :-

మితము తప్పి మద్యము త్రాగేవారు సగటున 12 సంవత్సరములు జీవనప్రమాణమును కోల్పోతారు. కొందఱు ప్రమాదాలకు గుఱి అయి, కొందఱు అధికమోతాదులలో త్రాగి సత్వర పరిణామముల వలన పిన్నవయస్సులో ప్రాణములు కోల్పోతారు. మరి కొందఱిలో దీర్ఘ కా ల అనారోగ్య పరిణామముల వలన మరణములు సంభవిస్తాయి. ప్రపంచములో 4 శాతపు మరణములు సారాయి వలన కలుగుతాయి. మద్య కాలేయ వ్యాధులు ( Alcoholic liver diseases ) : సుర కాలేయ వసవ్యాధి ( Alcoholic steatosis ) :-

మద్యము ఎక్కువగా త్రాగేవారి కాలేయ కణములలో (hepatocytes) వసామ్లములు ( fatty acids ) చేరి గ్లిసరాల్ ( glycerol) తో కూడి ట్రైగ్లిసరైడ్స్ గా (triglycerides) రూపొందుతాయి. ట్రైగ్లిసరైడ్స్ కొవ్వుపదార్థములు. ఇవి కాలేయకణములలో అధికముగా కూడితే కాలేయ వసవ్యాధి కలిగిస్తాయి. సుర కాలేయతాపము ( Alcoholic hepatitis ) :-

అధికముగా మద్యపానము  చేసేవారిలో 15 నుంచి 35 శాతము మందిలో కాలేయతాపము (hepatitis) కలుగుతుంది. కాలేయ తాపము వలన కొన్ని కాలేయకణములు మరణిస్తాయి (necrosis and apoptosis). తాపప్రక్రియ పర్యవసానముగా తంతీకరణము (fibrosis) కూడా జరుగుతుంది.

215 ::