పుట:Hello Doctor Final Book.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పచ్చకామెర్ల కు కారణాలు :రక ్తకణ విచ్ఛేదనపు / కాలేయ పూర్వపు కామెరలు ( Hemolytic / Prehepatic jaundice) :

ఎఱ్ఱరక్తకణాలు సుమారు 90 దినాల ఆయువు కలిగి ఉంటాయి. అవి త్వరితముగా అధిక ప్రమాణములలో విచ్ఛేదనమయితే వాటి నుంచి అధిక మోతాదులలో హీమోగ్లోబిన్ > హీమ్ > బిలిరుబిన్ లు విడుదల అవుతాయి. అధిక ప్రమాణములో విడుదల అయే బిలిరుబిన్ ను కాలేయము త్వరితముగా గ్లూకరానికామ్లముతో సంయోగపఱచ జాలనపుడు రక్తములో అసంయోగపు బిలిరుబిన్ (uncojugated - Indirect bilirubin) ప్రమాణము 2 మి.గ్రా. కంటె ఎక్కువైతే పసరికలు కలుగుతాయి. జన్యుపరముగా వచ్చే రక్తకణ విరూప వ్యాధులు; లవిత్రకణ వ్యాధి (Sickle cell anemia), వంశపారంపర్య గోళకార కణవ్యాధి (Hereditary Spherocytosis), అసాధారణపు హీమోగ్లోబినుల (Hemoglobinopathies) వలన  రక్తకణముల ఆయువు తగ్గి అవి త్వరితముగా విచ్ఛేదన పొందవచ్చును.

శరీర రక్షణ వ్యవస్థకు (Immunological system) స్వ (Self), పర (External) విచక్షణాలోపము కలుగుతే స్వయంప్రహరణ వ్యాధులు (Autoimmune diseases) కలిగి రక్తకణ విచ్ఛేదనము విశేషముగా జరుగవచ్చును. అందువలన రక్తక్షీణత (Autoimmune hemolytic Anemia), కామెరలు కూడా కలుగుతాయి.

అసంయోగపు బిలిరుబిన్ రక్తములో హెచ్చయినా దానికి జలద్రావణీయత (నీటిలో కరుగుట) లేకపోవుటచే మూత్రములో బిలిరుబిన్ ఉండదు. కాని కాలేయములో సంయోగ ప్రక్రియ (Conjugation) వలన ప్రేవులకు సంయోగపు బిలిరుబిన్ ఎక్కువగా చేరి యూరోబిలినోజెన్ ఎక్కువగా ఉత్పత్తి అయి మూత్రములో యూరోబిలినోజెన్ ఎక్కువగా ఉంటుంది.

208 ::