పుట:Hello Doctor Final Book.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎముకల మజ్జలో (Bone marrow) ఉత్పత్తి అవుతాయి. రక్త ప్రవాహములో సుమారు మూడునెలల కాలము మని, వృద్ధకణములు ప్లీహములోను (Spleen) కాలేయములోను (Liver) భక్షకకణములచే (Phagocytes) విచ్ఛేదనము పొందుతాయి. విచ్ఛేదనము పొందిన ఎఱ్ఱరక్తకణముల నుంచి విడుదలయే హీమోగ్లోబిన్ హీమ్ గాను, గ్లోబిన్ గాను ఛేదింపబడుతుంది. హీమ్ లో ఉన్న ఇనుము అయము తొలగించబడి శరీరములో నిక్షేపమయి మరల ఉపయోగపడుతుంది. ఇనుము పోగా మిగిలిన పార్ఫిరిన్ చక్రఛేదనము పొందుటవలన బిలిరుబిన్ ఏర్పడుతుంది. ఈ విధముగా ఏర్పడిన బిలిరుబిన్ బంగారు పసిడిఛాయలో ఉంటుంది. ఈ బిలిరుబిన్ కాలేయకణములలో గ్ లూ కొ రోనికామ్ల ము తో (Glucoronic acid) సంయోగము పొంది కాలేయమునుంచి పైత్యరసముతో (Bile) పైత్య నాళములకు (Bile ducts), పిత్తాశయమునకు ఆపై చిన్నప్రేవులకు విసర్జింపబడుతుంది. పెద్దప్రేవులలో, సూక్షాంగజీవులు గ్లూకొరోనికామ్లమును తొలగించి బిలిరుబిన్ ని యూరోబిలినోజన్ గా (Urobilinogen) మారుస్తాయి. యూరోబిలినోజెన్ కొంత రక్తములోనికి గ్రహించబడి ఆమ్లజనీ కరణముచే (Oxidation) యూరోబిలిన్ గా (Urobilin) మార్పుచెంది మూత్రము ద్వారా విసర్జితమవుతుంది. యూరోబిలిన్ వలన మూత్రమునకు ఎండుగడ్డి రంగు కలుగుతుంది. పెద్దప్రేవులలో యూరోబిలినోజెన్ లో చాలాభాగము  స్టెర్కోబిలిన్ గా (Stercobilin) మార్చబడుతుంది. స్టెర్కోబిలిన్ మలమునకు గోధుమరంగు యిస్తుంది. గ్లూకరానికామ్లముతో కాలేయకణములలో సంయోగమైన బిలిరుబిన్ (Conjugated Bilirubin) ని ‘పత్యక్ష  బిలిరుబిన్‘ (Direct Bilirubin) గా వ్యవహరిస్తారు. సంయోగముకాని బిలిరుబిన్ (Unconjugated Bilirubin) పరోక్ష బిలిరుబిన్ (Indirect Bilirubin). పరోక్ష బిలిరుబిన్ కి జలద్రావణీయత ( Water solubility) ఉండదు. అది పైత్యరసములోనికి రాదు. ప్రేవులకు చేరదు. సంయోగ బిలిరుబిన్ కి జలద్రావణీయత ఉండుటచే ప్రేవులకు పైత్యరసముతో చేరుతుంది. రక్తములో  బిలిరుబిన్ పరిమాణము 2 మి.గ్రా / డె.లీ కంటె ఎక్కువైతే పచ్చ కామెరలు పొడచూపుతుంది.

207 ::