పుట:Hello Doctor Final Book.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18. పచ్చకామెరలు (Jaundice) పచ్చకామెర్లు :

పచ్చకామెర్లు, కామెర్లు, పసరికలు  ( Jaundice) అనే మాట చాలామంది వినే ఉంటారు. ఒంటికి పచ్చరంగు రావడాన్ని పచ్చకామెర్లు కలుగుట అంటారు. ఈ పసుపురంగు కామెర్లు ఉన్నవారి  కళ్ళ తెల్లగుడ్డుపై (శ్వేత పటలము; Sclera) బాగా కనిపిస్తుంది. ఈ పసుపు వర్ణమునకు కారణము బిలిరుబిన్ అనే వర్ణకము (pigment). రోగుల రక్తములో బిలిరుబిన్ (Bilirubin) హెచ్చయి చర్మము, కంటి తెల్లగుడ్డుపైన చేరుటవలన ఆ వర్ణము కలుగుతుంది. రక్తములో ఏ ఏ కారణాల వలన బిలిరుబిన్ పెరుగుతుందో చర్చించే ముందు ఆ బిలిరుబిన్ ఎలా వస్తుందో వివరిస్తాను. బిలిరుబిన్ ఉత్పత్తి, విసర్జ న :-

రక్తములో ఎఱ్ఱకణాల వలన రక్తమునకు ఎఱ్ఱరంగు కలుగుతుంది. ఎఱ్ఱ రక్తకణాలు ప్రాణవాయువును (Oxygen) ఊపిరితిత్తుల నుంచి గ్రహించి శరీరములో వివిధ కణజాలమునకు చేర్చి వివిధ అవయవాల కణజాలము నుంచి బొగ్గుపులుసువాయువుని (Carbon dioxide) గైకొని ఊపిరి తిత్తులకు విసర్జనకై చేర్చుటకు తోడ్పడుతాయి. ఎఱ్ఱరక్తకణాలలో హీమోగ్లోబిన్ అనే వర్ణకము (Pigment) ఉంటుంది. ఈ వర్ణకము  వాయు సంవా హనమునకు తోడ్పడుతుంది.   హీమ్ (Heme) అనే రసాయనము  గ్లోబిన్ అనే మాంసకృత్తితో సంయోగము  చెందుట వలన హీమోగ్లోబిన్ ఏర్పడుతుంది. హీమ్ లో పార్ఫిరిన్  అనే రసాయన పదార్థము, ఇనుప అయనము (Ion) కలిసి ఉంటాయి. ఇనుప అయన ప్రభావముతో హీమోగ్లోబిన్ ప్రాణవాయువు, బొగ్గుపులుసువాయువు, యితర వాయువులను సంధించుకొని ఆ వాయువులకు వాహనముగా పనిచేస్తుంది. ఎఱ్ఱరక్తకణాలు శరీరములో

206 ::