పుట:Hello Doctor Final Book.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధన్యవాదములతో

పదికోట్లమంది మాట్లాడే భాష తెలుగు భాష. తెలుగునాడు నుంచి భారతదేశపు ఇతర ప్రాంతాలకు, ఆపై ఇతర దేశాలకు కూడా వలస వెళ్ళినవారు భాషను ఇతోధికముగా వ్యాప్తి చెందించారు. సాంకేతిక పరముగా అభివృద్ధి సాధించుకొనుట వలన, కొందఱి అసాధారణ యత్నము వలన గణనయంత్రాలలోను, సామాజిక జాల మాధ్యమములలోను తెలుగుభాష వాడుక విశేషముగా పెరిగింది. ప్రాత, కొత్త సాహిత్యసంపద, దినపత్రికలు, తెలుగు నిఘంటువులు, అనేక ఇతర విషయాలు చిటికెలో తెలుగులో లభ్యము అవుతున్నాయి.

ఈ శుభతరుణములో పెక్కు తెలుగు అంతర్జాల పత్రికలు వెలుగులోనికి వచ్చాయి. 2017 జనవరిలో కెనడా నుంచి ‘తెలుగుతల్లి కెనడా‘ మాసపత్రిక వెలువడుటయు, దేముడిచ్చిన మాచెల్లి శ్రీమతి రాయవరపు లక్ష్మిగారు ఆ పత్రికకు తెలుగులో వైద్యవిషయములను వ్రాయమని నన్ను ప్రోత్సహించుటయు జరిగాయి. 2017 ఏప్రిల్ మాసములో మొదలిడి నెలకొక వ్యాసము చొప్పున 2020 నవంబరు మాసము వఱకు నాకు నిత్యము అనుభవములో ఉన్నవి, నేను చికిత్స చేసేవి, ప్రజలకు ఉపయోగకరమని నేను భావించినవి అయిన వైద్యవిషయములపై వ్యాసములను వ్రాసాను. నాకు తెలుగుభాష, వైద్యములపై అభిలాష ఎక్కువ. వైద్యమయినా, ఇతర విజ్ఞానశాస్త్రములనయినా చెప్పుకొనుటకు తెలుగులో విస్తృత పదజాలము గలదని, లేని సందర్భాలలో చాలా సాంకేతిక పదములను తెలుగులో సృష్టించుకోగలమని ప్రగాఢ విశ్వాసము ఉండుటచే ఆ యత్నము కొనసాగించగలిగాను. పాఠకుల సౌలభ్యము కొఱకు ఆంగ్ల

xix ::