పుట:Hello Doctor Final Book.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదములను కూడా జతపఱిచాను. వైజ్ఞానిక విషయాలు ఏ భాషలో చదువుకున్నా కొంత జటిలముగానే ఉంటాయి. సాంకేతిక పదములు సమకూర్చుకొనుటకు ఆంగ్లము లాటిన్, గ్రీకు భాషలను ఆశ్రయించినట్లు భారతీయ భాషలు కొన్నిసారులు సంస్కృతమును ఆశ్రయించక తప్పదు. వ్యాసములను వీలయినంత సరళము చేయుటకు ప్రయత్నించాను. వైద్యబోధన గాని, మిగిలిన వైజ్ఞానిక శాస్త్రాలు గాని సమీప కాలములో ఉన్నత స్థాయిలో తెలుగులో బోధింపబడుతాయనే భ్రమ నాకు లేదు. కాని అధిక సంఖ్యాకులు మాట్లాడే మన తెలుగుభాషలో సకల వైజ్ఞానిక విషయాలు అందుబాటులోనికి రావాలనే ఆకాంక్ష, తప్పక వస్తాయనే విశ్వాసము నాకు ఉన్నాయి.

నా చిన్న ప్రయత్నమునకు ప్రోత్సాహము ఇచ్చిన తెలుగుతల్లి కెనడా పాఠక ప్రముఖులకు, ముఖపుస్తక మిత్రులకు ధన్యవాదములు. శిలీంధ్ర చర్మవ్యాధులకు ఛాయాచిత్రములను అందించి, నెమ్మిపలుకులతో ప్రోత్సాహమిచ్చిన నా ఆప్తమిత్రుడు, చర్మవ్యాధి నిపుణులు డా. గండికోట రఘురామారావు గారికి ఆదరపూర్వక కృతజ్ఞతలు. నైపుణ్యముతో ముఖచిత్రమును తీర్చిదిద్దిన శ్రీ పుక్కళ్ళ రామకృష్ణగారికి, కొన్ని వ్యాసములకు చిత్రాలను అందంగా సమకూర్చిన శ్రీ పొన్నాడ వెంకటరమణమూర్తిగారికి ప్రత్యేక ధన్యవాదములు. సమయాభావము వలన చాలా వైద్యాంశములకు తగిన చిత్రాలను నేనే వేసాను. ఆ చిత్రాలకు శ్రమతో, సాంకేతిక నిపుణతతో దిద్దుబాట్లు చేసి వివిధ భాగములను గుర్తించిన మా రెండవ కుమారుడు డా. భవానీశంకర్ కు ఆశీస్సులతో కృతజ్ఞతలు. రక్త ఘనీభవన సోపాన పటము తయారు చేసినది కూడా తనే.

నా వ్యాసములను తొలినుంచి శ్రద్ధగా చదువుచు వెన్నుతట్టుచు ఎంతో ప్రోత్సాహము అందించిన పూజ్యనీయులు, అగ్రజులు శ్రీ గంటి లక్ష్మీనారాయణ మూర్తిగారు తమ ఔదార్య వచనములతో మరల సంతోషము చేకూర్చారు. వారికి నా ప్రణామములు. ఈ వ్యాసములను ఓపికతో చదివి, సముచిత సలహాలు ఇచ్చిన నా ప్రియమిత్రుడు, సహాధ్యాయి డాక్టరు అడుసుమిల్లి శివరామచంద్రప్రసాద్ కు శతధా కృతజ్ఞతలు. నా వ్యాసములన్నీ వెలువడగానే ఓపికతో చదివి తన అభిప్రాయములను చెబుతూ యిపుడు సదయతో పుస్తకమునకు

xx ::