పుట:Hello Doctor Final Book.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాధి లక్షణములు :-

నారంగ కాలేయవ్యాధిలో కాలేయకణముల విధ్వంసము జరిగి కాలేయవ్యాపారము మందగించుట వలన కొన్ని వ్యాధి లక్షణములు కలుగుతాయి. వ్యాధి ముదరక మునుపు ఎట్టి లక్షణములు కనిపించవు. వ్యాధి అంచెలంచెలుగా ముదిరినపుడు వ్యాధి లక్షణములు పొడచూపుతాయి. కాలేయములో తంతీకరణము (fibrosis) జరిగి ద్వారసిరపై (portal vein) ఒత్తిడి పెరిగి ద్వారసిరలో రక్తపీడనము పెరుగుట వలన కొన్ని వ్యాధి లక్షణములు కలుగుతాయి. ద్వారసిర (portal vein) జీర్ణాశయము (stomach), చిన్నప్రేవులు (small intestines), క్లోమము (pancreas), ప్లీహము (spleen), పిత్తాశయముల (gall bladder) నుంచి రక్తమును కాలేయమునకు చేర్చుతుంది. ద్వారసిర కాలేయములో సూక్ష్మ రక్తకేశనాళికలుగా (capillaries) చీలి రక్తమును కాలేయకణములకు అందజేస్తుంది. ఈ రక్తము ద్వారా జీర్ణమండలము నుంచి గ్రహించిన పోషకపదార్థములు, విషపదార్థములు (toxins) కాలేయ కణములకు చేరుతాయి. కాలేయ ధమని (hepatic artery) కూడా కాలేయమునకు రక్తము కొనిపోతుంది. కాలేయధమని శాఖలు, సూక్ష్మరక్తకేశనాళికలుగా చీలి కాలేయకణములకు రక్తమును అందజేస్తుంది. సూక్ష్మరక్తకేశనాళికల కలయిక వలన కాలేయసిర (hepatic vein) ఏర్పడి  అధోబృహత్సిర (Inferior venacava) ద్వారా రక్తమును హృదయమునకు చేరుస్తుంది.

కాలేయములో తంతీకరణము (fibrosis) జరిగినపుడు ద్వారసిర రక్తప్రవాహమునకు అవరోధము కలుగుతుంది. అందుచే ద్వారసిరలో రక్తపీడనము పెరుగుతుంది (portal hypertension). అందువలన జీర్ణమండలపు సిరలలో పీడనము, సాంద్రత (congestion) పెరుగుతాయి. ద్వారసిరలో అధికపీడనము వలన క్రింది లక్షణములు కలుగుతాయి. ఉరుప్లీ హము ( splenomegaly ):-

ద్వారసిర అధికపీడనము (portal hypertension) వలన ప్లీహములో (spleen) సాంద్రత (congestion) పెరిగి ప్లీహ పరిమాణము పెరుగుతుంది.

194 ::