పుట:Hello Doctor Final Book.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇనుము ( అయ ) వర్ణకవ్యాధి ( Hemochromatosis ) :-

వంశపారంపర్యముగా సంక్రమించు ఈ వ్యాధిగ్రస్థులలో చిన్నప్రేవులు ఆహారములో ఇనుమును అధికముగా గ్రహించుట వలన కాలేయములో ఇనుము నిల్వలు  పెరుగుతాయి. హృదయము, క్లోమము, చర్మము, ఇతర అవయవములలో కూడా ఇనుము నిల్వగా చేరుట వలన వీరిలో నారంగకాలేయవ్యాధి, మధుమేహము, చర్మములో కంచువర్ణము, హృదయవైఫల్యము (heart failure) పొడచూపుతాయి. తామ్ర కాలేయవ్యాధి ( Wilson’s disease ) :-

జన్యుపరముగా కలిగే ఈ వ్యాధిగ్రస్థులలో ATP7B అనే మాంసకృత్తి లోపము వలన కాలేయకణములు   రాగిని పైత్యరసము లోనికి తగినంతగా విసర్జింపజాలవు. అందువలన కాలేయములో రాగినిల్వలు పెరిగి కాలేయకణముల విధ్వంసమునకు, నారంగ కాలేయవ్యాధికి దారితీస్తాయి. ఆపై రాగి కంటి స్వచ్ఛపటలములోను (cornea), మెదడులోను, మూత్రాంగముల లోను (kidneys) కూడా నిక్షిప్తము అవుతుంది. వీరి రక్తద్రవములో (plasma) రాగి విలువలు తక్కువగా ఉంటాయి. రక్తద్రవములో తామ్రవాహకము సెరులోప్లాస్మిన్ (serum ceruloplasmin) విలువలు తగ్గిఉంటాయి. వీరి మూత్రములో రాగి విలువలు హెచ్చుగా ఉంటాయి. ఆల్ఫా 1 ఏంటిట్రిప్సిన్ (alpha 1 antitrypsin) అనే జీవోత్ప్రేరకము లోపించిన వారిలో కూడా నారంగ కాలేయవ్యాధి కలుగగలదు. భారతీయశిశు నారంగ కాలేయవ్యాధి ( Indian childhood cirrhosis ) :-

ఇది జన్యుపరముగా 1-3 సంవత్సరాల శిశువులలో కాలేయములో రాగినిల్వలు పెరుగుట వలన కలిగే వ్యాధి. రాగి, కంచుపాత్రల వాడకము ఈ రోగమునకు దోహదపడుతుంది. రాగి, కంచుపాత్రల వాడకము తగ్గుట వలన, వ్యాధిని త్వరితముగా నిర్ణయించి చికిత్సలు చేయుట వలన ఈ వ్యాధి, దీని వలన కలిగే శిశు మరణములు అఱుదు అయినాయి.

మరికొన్ని ఇతర కారణముల వలన, తెలియని కారణముల వలన (cryptogenic) నారంగ కాలేయవ్యాధి కలుగవచ్చును.

193 ::