పుట:Hello Doctor Final Book.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వలన వ్యాధి లక్షణములు కనిపిస్తాయి. జలోదరముతో (Ascites) ఎత్తైన బూరకడుపుతోను, పచ్చకామెరలు వలన నారింజ రంగుతోను ఈ వ్యాధిగ్రస్థులు అంత్యదశలలో కనిపిస్తారు.

కాలేయకణముల విధ్వంసము కలిగించు వివిధ విష పదార్థములు, వ్యాధులు, నారంగ కాలేయవ్యాధికి దారి తీయవచ్చును. మద్యపానము, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి విషజీవాంశములు (viruses) కలిగించే దీర్ఘకాల కాలేయతాపములు (Chronic hepatitis), కొవ్వుపదార్థములు వలన కలిగే ‘వస కాలేయ తాపములు ‘ (nonalcoholic steatohepatitis - NASH ) వలన హెచ్చు శాతపు నారంగ కాలేయ వ్యాధులు కలుగుతాయి. మద్యపానము :-

మితము మించి మద్యము దీర్ఘకాలము (పది సంవత్సరములకు మించి) సేవించువారిలో 15- 20 శాతము మందిలో నారంగ కాలేయవ్యాధి పొడచూపుతుంది. మద్యము (ఆల్కహాలు) కాలేయములో ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్ (alcohol dehydrogenase) అనే జీవోత్ప్రేరకము (enzyme) వలన ఎసిటాల్డిహైడ్ గా (acetaldehyde) మారుతుంది. ఎసిటాల్డిహైడు వలన కాలేయతాపము, కాలేయ కణ విధ్వంసము, దీర్ఘకాలములో నారంగ కాలేయవ్యాధి కలుగుతాయి. మద్యము కాలేయములో పిండిపదార్థములు, కొవ్వులు, మాంసకృత్తుల వ్యాపారములపై (metabolism) కూడా ప్రభావము చూపిస్తుంది. మితము మీఱి మద్యపానము సలిపేవారిలో కాలేయములో కొవ్వు నిలువలు పెరిగి మద్య వసకాలేయ వ్యాధిని (alcoholic fatty liver ), మద్య వసకాలేయతాపమును (alcoholic steatohepatitis) కలిగించగలవు. సుమారు 30 శాతపు నారంగ కాలేయవ్యాధులు మితిమీఱిన మద్యపానము వలన కలుగుతాయి. విషజీవాంశములు కలిగించు కాలేయతాపములు (viral hepatitis)-

పెక్కు విషజీవాంశములు (viruses) కాలేయ తాపమును (hepatitis) కలిగించగలవు. వీనిలో హెపటైటిస్ -బి, హెపటైటిస్ - సి విషజీవాంశములు (viruses) కలిగించు కాలేయతాపము కొందఱిలో దీర్ఘకాల కాలేయ

191 ::