పుట:Hello Doctor Final Book.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16. జీర్ణ వ్రణములు ( Peptic ulcers ) జీర్ణమండలము :

మనము భుజించే ఆహారము అన్ననాళము (Esophagus) ద్వారా జీర్ణాశయము లోనికి చేరుతుంది. జీర్ణాశయములో జీర్ణమయి చిక్కని ద్రవముగా మారిన ఆహారము జీర్ణాశయ నిర్గమనము (Pylorus) ద్వారా చిన్నప్రేవులకు చేరుతుంది. చిన్నప్రేవులను ప్రథమాంత్రము (Duodenum), మధ్యాంత్రము (Jejunum), శేషాంత్రము (Ileum) అని మూడు భాగములుగా విభజించవచ్చును. చిన్నప్రేవులలో జీర్ణప్రక్రియ పూర్తయి ఆహార పదార్థాల గ్రహణము (absorption) పూర్తయి, శేషము నీటితో సహా పెద్ద ప్రేవులకు చేరుతుంది. పెద్దప్రేవులలో (బృహదాంత్రము) నీరు గ్రహించబడి మిగిలినది మలముగా విసర్జింపబడుతుంది. ఆహారపదార్థాల జీర్ణము జీర్ణమండలములో స్రవించబడే జీర్ణరసములు, వానిలోని జీవోత్ప్రేరకములపై ( Enzymes ) ఆధారపడుతుంది. నోటిలో స్రవించే లాలాజలములో టయాలిన్ (ptyalin) చక్కెర గ్రహణమునకు తోడ్పడుతుంది. జఠరములో జఠరరసము స్రవించబడి అందులో ఉన్న పెప్సిన్ మాంసకృత్తుల జీర్ణమునకు తోడ్పడుతుంది. క్లోమమములో ఉత్పత్తి అయే క్లోమరసములో ఎమిలేజ్ (Amylase) పిండిపదార్థాల జీర్ణమునకు, లైపేజ్ (Lipase) క్రొవ్వుల జీర్ణమునకు, ట్రిప్సినోజెన్ (Trypsinogen), ఖైమోట్రిప్సినోజెన్ లు (Chymotrypsinogen) ఆంత్రములలో ట్రిప్సిన్ (Trypsin), ఖైమోట్రిప్సిన్ లుగా (Chymotrypsin) మారి మాంసకృత్తులను జలవిచ్ఛేదన ( Hydrolysis) ప్రక్రియ ద్వారా పెప్టైడులు (Peptides), ఎమినో ఆమ్లములుగా (Amino acids) విచ్ఛేదించి వాని గ్రహణమునకు తోడ్పడుతాయి. కాలేయములో ఉత్పత్తి అయే పైత్యరసములోని పైత్యము క్రొవ్వుపదార్థాల జీర్ణమునకు తోడ్పడుతుంది.

జఠరాశయమును నాలుగు భాగములుగా గుర్తిస్తారు. అవి పైకప్పులా ఉండే జఠరమూలము (Fundus ), కాయము ( Body), అంతిమకుహరము ( Antrum ), నిర్గమనము ( Pylorus). జఠరపు లోపొరలో ( శ్లేష్మపు పొర

181 ::