పుట:Hello Doctor Final Book.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసరణము తగ్గుతుంది. పుపుసగోళములలో గాలి ఎక్కువగా చేరుకొని ఊపిరితిత్తులు ఉబ్బుతాయి. వాయుప్రసరణ తగ్గుటవలన, తాపము వలన, పుపుసగోళముల విధ్వంసము వలన పుపుసగోళములు  రక్తకేశనాళికల మధ్య ప్రాణవాయువు బొగ్గుపులుసువాయువుల మార్పిడి మందగిస్తుంది. పుపుసధమనులలో రక్తపుపోటు కూడా హెచ్చవుతుంది (Pulmonary hypertension). అందువలన వ్యాధి బాగా ముదిరిన వారిలో హృదయపు కుడిజఠరికపై (Right ventricle) పనిభారము అధికమై హదయవైఫల్యమునకు (congestive heart failure) దారితీస్తుంది. వ్యాధి ప్రకోపించి చివరి దశలలో రక్తములో ప్రాణవాయువు పరిమాణము తగ్గి, బొగ్గుపులుసువాయువు పరిమాణము పెరిగి  శ్వాసవైఫల్యము (Respiratory failure), రక్త ఆమ్లీకరణలకు (Respiratory acidosis) దారితీస్తుంది. శ్వాస అవరోధవ్యాధి కలవారిలో గుండెజబ్బులు, గుల్ల ఎముకలవ్యాధి (Osteoporosis), కండరముల నీరసము ఎక్కువగా కలుగుతాయి. వ్యాధి లక్షణములు :-

ఊపిరితిత్తుల వ్యాపారము బాగా దెబ్బతినే వఱకు (FEV1 50 శాతమునకు మించి క్షీణించే వఱకు) ఏ లక్షణములు పొడచూపవు. దీర్ఘకాలిక శ్వాస అవరోధవ్యాధి తీవ్రమయిన వారికి తఱచు దగ్గు, కఫము, ఆయాసము, ఊపిరి వదిలేటప్పుడు పిల్లికూతలు కలుగుతాయి. ప్రారంభ దశలో ఆయాసము పనిచేస్తున్నపుడు, శారీరకశ్రమ ఎక్కువయిన సమయములలో కలిగినా వ్యాధి ముదిరాక విశ్రాంత సమయములలో కూడా కలుగుతుంది. సూక్ష్మజీవులు, విషజీవాంశములు (viruses), హానికర వాయువులు వలన ఊపితిత్తులలో తాపము కలిగినపుడు, వ్యాధి లక్షణములు హెచ్చుగా కన్పిస్తాయి. ఆయాసము పెరిగినపుడు ఆందోళన కూడా కలుగుతుంది. కఫమునకు సాధారణ స్థితులలో రంగు ఉండదు. సూక్ష్మజీవుల వలన తాపము కలిగినప్పుడు కఫము చీమురంగులోను, పచ్చరంగులోను ఉంటుంది. రక్తములో బొగ్గుపులుసుగాలి పెరిగితే అతినిద్ర, అపస్మారక స్థితి కలుగవచ్చును. వీరిలో ఊపితిత్తుల ఉబ్బుదల వలన ఛాతి పీపా ఆకారములో ఉంటుంది.

172 ::