పుట:Hello Doctor Final Book.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్వాసనాళము, పుపుసనాళముల గోడలలో ఉన్న మృదులాస్థి (Cartilage), పుపుసనాళికల, శ్వాసనాళికల గోడలలో ఉండు అనిచ్ఛా మృదుకండరములు (Smooth muscles) ఆ నాళములను, నాళికలను నిత్యము తెఱిచి ఉంచుతాయి. పుపుసగోళముల బయట ఉండు సాగుకణజాలము (Elastic tissue) పుపుసగోళములు పూర్తిగా అణిగిపోవుటను అరికడుతాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసముల వలన శ్వాసవృక్షములో (Bronchial tree) వాయుచలనము జరుగుతుంది. ఈ వాయుచలనానికి అవరోధము ఏర్పడినప్పుడు రక్తమునకు ప్రాణవాయువు చేరుటకు, రక్తమునుంచి బొగ్గుపులుసువాయువు తొలగించబడుటకు అంతరాయము ఏర్పడుతుంది. శ్వాసవృక్షములో వాయుచలనమునకు అవరోధము కలిగించే రుగ్మతలలో ఉబ్బసవ్యాధి (Bronchial Asthma) ఒకటి.

160 ::