పుట:Hello Doctor Final Book.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14. ఉబ్బస (Bronchial Asthma) శ్వాసక్రియ :

శరీరకణజాలపు జీవప్రక్రియలో ప్రాణవాయువు (Oxygen) గ్రహించబడి బొగ్గుపులుసువాయువు (Carbon dioxide) విడుదల అవుతుంది. వివిధ అవయవముల కణజాలమునకు రక్తముద్వారా ప్రాణవాయువు అందించబడుతుంది. ఆయా కణజాలమునుంచి బొగ్గుపులుసువాయువు రక్తములోనికి చేరుతుంది. ఊపిరితిత్తులు ప్రాణవాయువును రక్తమునకు అందించి రక్తమునుంచి బొగ్గుపులుసువాయువును గ్రహించి బయటకు విసర్జిస్తాయి. నిరంతరము ప్రాణవాయువును రక్తమునకు చేర్చుటకు, బొగ్గుపులుసువాయువును విసర్జించుటకు ఉచ్ఛ్వాస నిశ్వాసాల శ్వాసక్రియ, ఊపిరితిత్తులుకు రక్తప్రసరణ అవసరము. వాతావరణములో ఉన్న గాలి ముక్కు, గొంతుక, స్వరపేటికల ద్వారా శ్వాసనాళమునకు (Trachea) చేరుతుంది. శ్వాసనాళము రెండు పుపుసనాళములుగా (Bronchi) చీలి రెండు ఊపిరితిత్తుల వాయుప్రసరణకు సహాయపడుతుంది. ప్రతి ఊపిరితిత్తిలో పుపుసనాళము ద్వితీయ, తృతీయ, అంతిమ పుపుసనాళములుగా (secondary tertiary and terminal bronchi) శాఖలై పిదప శ్వాసనాళికలు (Respiratory bronchioles), పుపుసగోళనాళికలుగా (Alveolar ducts) చీలి చిట్టచివర పుపుసగోళములను (Alveoli) ధరిస్తాయి. ఈ పుపుసగోళములు, వాని దరిని ఉండు రక్తకేశనాళికల (Capillaries) మధ్య వాయువుల మార్పిడి జరుగుతుంది

159 ::