పుట:Hello Doctor Final Book.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రచురణకర ్త అభినందన వాక్యాలు

డా. గన్నవరపు నరసింహమూర్తిగారు పేరెన్నిక గన్న వైద్యులే కాక సాహిత్యము పై విశేషమైన అభిమానము కలవారు. వారికి తెలుగు భాషపై ఉన్న మక్కువ కొద్దీ అనేకమైన ఛందోబద్ధమైన పద్యాలు రచించడమే కాక, ఆసక్తి కలవారికి ఛందస్సు నేర్పడం చేస్తుంటారు. వారు వ్రాసిన పద్యాలు మంచి చమత్కారాన్ని కలిగి ఉండి, చదువరులని ఆకట్టుకుంటాయి. వారు ఫేస్బుక్ లో వ్రాసిన కొన్ని వైద్య సంబంధిత వ్యాసాలను గమనించి, తెలుగుతల్లి కోసం వ్రాయమని అభ్యర్థించాను. తరచుగా అందరినీ బాధించి, భయపెట్టే అనేక

వ్యాధుల గురించి అందరికీ సులువుగా అర్థమయ్యేలా 45 మాసాల పాటు క్రమం తప్పకుండా రచనలు వ్రాసి పంపారు. ఈ వ్యాసాలలో విశేషమేమి టంటే, ఆంగ్లంలో ఉన్న వైద్య పరిభాషా పదకోశాన్ని తెలుగుకి అనువాదం చేసి, తెలుగు పదాలతోనే పూర్తి వ్యాసాలు వ్రాసారు. ఈ క్రమంలో వారు అనేకమైన భాషాపదకోశాల నుండి అర్థాలు తీసుకోవడమే కాక, తెలుగులో సరియైన అర్థం రావడానికి చాలా పరిశోధన చేసారు. ఇది ఎంత సమయము శ్రమతో కూడుకున్న పనో మనం ఊహించవచ్చు. ఒకోసారి వ్యాసం ప్రచురించ బోయే దాకా కూడా వారికి అసంతృప్తిగా అనిపించిన పదాల కోసం అన్వేషించి, చివరి నిమిషంలో కొత్త పదాలని ఇచ్చిన సందర్భాలు అనేకం. వారి అంకితభావానికి ఇది మచ్చుతునక. తెలుగుతల్లిలో ప్రచురించాక ఫేస్బుక్ పై పంచుకున్న వారి వ్యాసాలు అనేకమంది పండిత పామరుల, వైద్యుల మన్ననలను పొందాయి. ఈ రచనలు తెలుగురాష్ట్రాలలోని భవిష్య వైద్యవిద్యార్థులకు ఉపయోగపడతాయని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. ఈ పుస్తకం కళాశాల గ్రంధాలయాల్లో ఉండదగినదని నేను భావిస్తున్నాను.

xv ::