పుట:Hello Doctor Final Book.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరిలో ఆయాసము, ఛాతినొప్పి, దగ్గు, కఫములో రక్తము (hemoptysis), గుండెదడ, గుండెవేగము పెరుగుట, అల్ప రక్త ప్రాణవాయు ప్రమాణము (hypoxemia), కుడి జఠరిక వైఫల్యపు లక్షణములు, కాళ్ళలో గాని, చేతులలో గాని నిమ్నసిర రక్తఘనీభవన లక్షణములు (signs of deep vein thrombosis) కనిపిస్తాయి. రక్తపుగడలు ్డ విస్తృతముగా పుపుస ధమనికి చేరినపుడు ఆకస్మిక ప్రాణహానికి అవకాశములు ఉన్నాయి. క్రిందకాలులో సూక్ష్మజీవుల వలన కలిగే కణతాపము (cellulitis) లోను, జానుభస్త్రిక బుద్బుదము (Baker’s cyst of gastrocnemiosemimembranosus bursa) విచ్ఛిన్నమయినపుడు, పిక్క కండరములు తెగినపుడు (rupture of gastrocnemius muscle), చర్మము క్రింద గాని కండరములలో గాని రక్తనాళములు చిట్లి రక్తము గూడుకట్టినపుడు (hematoma), చీముతిత్తులు (abscesses), రసిపొంగులు (lymphedema), ధమని బుద్బుదములు (aneurysms) వలన, ఉబ్బుసిరల వలన సాంద్రత (congestion) పెరిగినపుడు నిమ్నసిరల రక్తఘనీభవన లక్షణములను వంటి లక్షణములు పొడచూపవచ్చును.

152 ::