పుట:Hello Doctor Final Book.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాదము పైభాగములో ఊర్ధ్వపాద సిరచాపము (dorsal venous arch of foot) మధ్యస్థముగా (medially) చీలమండ (ankle - medial malleolus) ఎముకకు ముందుగా కాలిపైకి  గరిష్ఠ దృశ్యసిరగా (great saphenous vein) ఎగబ్రాకుతుంది. తొడకు మధ్యస్థముగా (medially) యీ గరిష్ఠ దృశ్యసిర (great saphenous vein) పయనించి తొడ పైభాగములో  దృశ్యసిర రంధ్రము (saphenous orifice) ద్వారా కండర ఆచ్ఛాదనము (deep fascia) లోనికి చొచ్చి ఊరుసిరతో (femoral vein) కలుస్తుంది.

ఊర్ధ్వపాద సిరచాపము (dorsal venous arch of foot) పార్శ్వభాగమున చిటికెనవేలు పైభాగపు అంగుళిక సిరతో (digital vein) కలిసి కనిష్ఠ దృశ్యసిరగా (Lesser Saphenous vein) చీలమండలము పార్శ్వభాగపు ఎముకకు (lateral malleolus) వెనుకగా పైకి ప్రాకి కాలు వెనుక భాగములో పయనిస్తుంది. కాలి పై భాగములో మోకాలు వెనుక ఈ సిర కండర ఆచ్ఛాదనము (deep fascia) లోనికి చొచ్చి జానుసిరతో (popliteal vein) కలుస్తుంది. జానుసిర, ఊరుసిరగా (femoral vein) తొడలోపల పైకి పయనిస్తుంది. కాలిలో ఉన్న పూర్వజంఘిక సిర (Anterior tibial vein), పృష్ఠజంఘిక సిరల (Posterior tibial vein) కలయిక చేత జానుసిర (Popliteal vein) ఏర్పడుతుంది. ఇది మోకాలు వెనుక ఉంటుంది. జానుసిర తొడలో ఊరుసిర (Femoral vein) అవుతుంది. కటివలయములో (pelvis) ఊరుసిర  బాహ్య శ్రోణిసిరయై (external ileac vein), అంతర శ్రోణిసిరతో (internal ileac vein) సంధానమయి శ్రోణి సిరను (common ileac vein) ఏర్పరుస్తుంది.

వామ, దక్షిణ శ్రోణిసిరల సంధానము వలన అధోబృహత్సిర (inferior venacava)  ఏర్పడుతుంది.  అధోబృహత్సిర హృదయపు  కుడి కర్ణికకు రక్తమును చేర్చుతుంది.

148 ::