పుట:Hello Doctor Final Book.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాహ్యసిరతాప రక ్తఘనీభవనము ( Superficial thrombophlebitis ) :

బాహ్య సిరలలో తాపము (inflammation) వలన రక్తము గడ్డకట్ట వచ్చును. సాధారణముగా సిరల ద్వారా మందులను, ద్రవములను, ఇచ్చుట వలన సిరలలో తాపము కలిగి రక్తము గడ్డకడుతుంది. తాపము కలిగిన బాహ్యసిరలలో తాప లక్షణములు కనిపిస్తాయి. తాకుతే నొప్పి, ఎఱ్ఱదనము, వెచ్చదనము కలిగి ఈ సిరలు నులక తాడులులా తగులుతాయి. బాహ్య సిరలలో తాపము కలిగి రక్తము గడ్డకడితే ఆ గడ్డలు సిరలకు అంటుకొని ఉంటాయి. ఇవి గుండెకు, పుపుస ధమనులకు వెళ్ళవు. ఇవి ప్రమాదకరము కావు. నిమ్నసిరలలో రక ్తము గడ్డ కట్టు ట ( Deep vein thrombosis ) :

నిమ్నసిరలలో (deep veins) రక్తము గడ్డకడితే రక్తఘనీభవనము ముందుకు వ్యాపించగలదు. రక్తపుగడ్డలు ప్రవాహములో ముందుకు సాగి పుపుస ధమనులలో (pulmonary arteries) ప్రసరణకు అవరోధము (Pulmonary embolism) కలిగించవచ్చును. పుపుస ధమనులలో రక్తపుగడ్డలు, యితర ప్రసరణ అవరోధకములు (emboli) రక్తప్రసరణకు విశేషముగా భంగము కలిగిస్తే ప్రాణహాని కలిగే అవకాశము ఉన్నది. అందువలన జానుసిర (popliteal vein)  పైన సిరలలో రక్తఘనీభవనము జరుగుతే చికిత్స అవసరము. నిమ్నసిరలలో రక ్తఘనీభవనమునకు కారణములు :

సిరలలో రక్త నిశ్చలత (stasis), రక్తపు అధిక ఘనీభవన లక్షణము (hyper coagulability), రక్తనాళపు లోపొరలో మార్పులు (endothelial changes) రక్తనాళములలో రక్తము ఘనీభవించుటకు కారణము అవుతాయి.

కదలకుండా, నడవకుండా ఉండుట, ఎల్లపుడు పక్కలపై పడుకొని ఉండుట (immobility) రక్తపుగడ్డలు ఏర్పడుటకు ముఖ్యకారణము. శస్త్ర చికిత్సలు, క్షతములు (trauma), వార్ధక్యము, స్థూలకాయము, కర్కటవ్రణములు (cancers), రక్తనాళపు వ్యాధులు (collagen vascular diseases), ఎస్ట్రొజెన్ ల వాడుక, గర్భనిరోధక ఔషధముల వాడుక, ధూమపానము,

149 ::