పుట:Hello Doctor Final Book.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సిరలు సాగి, ఉబ్బి, మెలికలు తిరిగి ఉబ్బుసిరలుగా (varicose veins ) మారవచ్చును. ఉబ్బుసిరలను కాళ్ళలో సామాన్యముగా చూస్తాము. ఉబ్బుసిరలు ఏర్పడుటకు కారణములు :

ఉబ్బుసిరలు జన్యుపరముగా రావచ్చును. ఉబ్బుసిరలు పురుషులలో కంటె స్త్రీలలో హెచ్చుగా కలుగుతాయి. ఇవి స్థూలకాయము కలవారిలోను, గర్భిణీస్త్రీలలోను ఎక్కువగా కలుగుతాయి. కటివలయములో పెరుగుదలల వలన శ్రోణిసిరలపై ఒత్తిడి పెరిగితే ఉబ్బుసిరలు కలుగవచ్చును. బాహ్యసిరలలో తాపప్రక్రియ (inflammation) కలిగి కవాటములు చెడిపోతే తిరోగమన రక్తప్రవాహము వలన సిరలు ఉబ్బగలవు. సిరలు వ్యాకోచము చెందినపుడు కవాటముల సామర్థ్యత తగ్గుతుంది. ఛిద్రసిరల కవాటములు పనిచేయనిచో నిమ్నసిరలనుంచి రక్తము బాహ్యసిరలలోనికి ప్రవహించి వాటిని వ్యాకోచింపజేస్తాయి. రక్తములో హోమోసిష్టిన్ ప్రమాణములు పెరిగితే (hyperhomocysteinemia) సిరల గోడలలోని సాగుకణజాలము ( elastin) పీచుపదారము ్థ (collagen) ధ్వంసమయి సిరలు ఉబ్బగలవు.

వయస్సు పెరిగినవారిలోను, వ్యాయామము తక్కువైనవారిలోను, దినములో ఎక్కువగా నిలబడి ఉండేవారిలోను ఉబ్బుసిరలు ఎక్కువగా కలుగుతాయి. వ్యాధిలక్షణములు :

ఉబ్బుసిరలు కంటికి కనిపిస్తాయి. ఉబ్బుసిరలు వ్యాకోచము పొంది, సాగి, పొడవయి, మెలికలు కలిగి ఉంటాయి. సులభముగా అణచబడుతాయి. వీటివలన కాళ్ళలో పీకు, బరువు, లాగుతున్నట్లు నొప్పి కలుగవచ్చు. చీలమండ, పాదములలో పొంగు, వాపు కలుగవచ్చు. చర్మములో గోధుమ వర్ణకము కనిపించవచ్చును. చీలమండ పైభాగములో చర్మముక్రింద కొవ్వుతోను (subcutaneous fat), పీచుకణజాలముతోను (fibrous tissue) గట్టిపడి (lipodermatosclerosis) చుట్టూ నొక్కినట్లు (ఆకుంచనము; constriction) కనిపించవచ్చును. చర్మములో తెల్లని మచ్చలు కలుగవచ్చును.

142 ::