పుట:Hello Doctor Final Book.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాల్సియం, తాపకణములు పేరుకొని ఫలకలుగా (plaques) పొడచూపుతాయి. ఈ పలకలు రక్తనాళముల లోపలి పరిమాణమును తగ్గిస్తాయి. ధమనుల లోపలి పరిమాణము ఎక్కువగా తగ్గితే కణజాలమునకు రక్తప్రసరణ తగ్గుతుంది. ధమనుల లోపొరలోని పలకలు చిట్లుతే వాటిపై తాపప్రక్రియ కలిగి, రక్తపుగడ్డలు ఏర్పడి (thrombosis) రక్తప్రసరణకు ఆకస్మిక అవరోధము కలుగజేయగలవు.

దూరధమనుల వ్యాధి సాధారణముగా కాళ్ళలో చూస్తాము. ఈ వ్యాధివలన రక్తప్రసరణకు ఆటంకము ఏర్పడుతుంది. అమెరికాలో అరవై సంవత్సరాలు దాటిన వారిలో 12 నుంచి 20 శాతపు వారిలోను ఎనభై అయిదు సంవత్సరాలు దాటిన వారిలో 50 శాతపు వారిలోను దూరధమని వ్యాధి పొడచూపుతుంది. ప్రపంచములో 20 కోట్లమంది యీ వ్యాధిగ్రస్థులు ఉంటారు. కారణములు :

వృద్ధాప్యము వలన ధమనీకాఠిన్యత కలిగినా పిన్నవయస్సులోనే యీ వ్యాధిని తీవ్రతరము చేసే కారణములను వైద్యులు, శాస్త్రజ్ఞులు చాలా సంవత్సరముల పూర్వమే పసిగట్టారు. ఇవి : ధూమపానము :

దూరధమని వ్యాధిని కలుగజేసే కారణములలో పొగత్రాగుట ప్రధమ స్థానములో నిలుస్తుంది. దూరధమని వ్యాధి కలిగేవారిలో 80 నుంచి 90 శాతము మంది ప్రస్తుతపు, లేక పాత ధూమపానీయులే.

ఇతరుల నుంచి పొగ పీల్చినవారిలో కూడా యీ వ్యాధి కలిగే అవకాశములు ఉన్నాయి. వీరిలో రక్తనాళముల లోపొరలో జరిగే మార్పుల వలన ధమనీ కాఠిన్యత వేగము పెరుగుతుంది. దినమునకు కాల్చే పొగాకు, ధూమపానము చేసిన సంవత్సరములతో వ్యాధి అనుపాత నిష్పత్తితో ముడిపడి ఉంటుంది.

130 ::