పుట:Hello Doctor Final Book.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11. దూర(మేర) ధమని వ్యాధి ( Peripheral Arterial Disease ) దూర (మేర) ధమనులలో రక్తప్రసరణకు అంతరాయము కలుగుతే దానిని దూర (మేర) ధమని వ్యాధిగా (Peripheral Arterial Disease) పరిగణిస్తారు. ఈ దూర (మేర) ధమని వ్యాధికి ముఖ్యకారణము ధమనీ కాఠిన్యత (arteriosclerosis). కాళ్ళ ధమనులు ( Arteries of lower extremities ) :

శరీరములో వివిధ అవయవాలకు ధమనుల ద్వారా రక్తప్రసరణ జరిగి వాటి కణజాలమునకు ప్రాణవాయువు, పోషకపదార్థములు అందించ బడుతాయి. గుండె ఎడమజఠరిక (left ventricle) నుంచి బయల్వడు బృహద్ధమని (aorta) ఛాతి నుంచి ఉదరములో ఉదర బృహద్ధమనిగా (abdominal aorta) వివిధ శాఖలను ఇచ్చి, కటివలయములో (pelvis) రెండు శ్రోణిధమనులుగా (ileac arteries) చీలుతుంది. ప్రతి శ్రోణిధమని బాహ్య శ్రోణిధమని (external ileac artery), అంతర శ్రోణిధమని (internal ileac artery) శాఖలను ఇస్తుంది. బాహ్య శ్రోణి ధమని తొడ లోనికి తొడధమనిగా (ఊరుధమని femoral artery ; ఊరువు = తొడ)  ప్రవేశిస్తుంది. ఊరుధమని నిమ్నోరుధమని (Profunda femoris artery) శాఖను యిచ్చి బాహ్యోరు ధమనిగా (Superficial femoral artery) తొడలో కొనసాగి మోకాలి వెనుకకు జానుధమనిగా (Polpliteal artery) ప్రవేశించి పూర్వ జంఘికధమని (anterior tibial artery), పృష్ఠ జంఘికధమని (Posterior tibilal artery) శాఖలుగా చీలుతుంది. ఈ ధమనులు కాళ్ళకు, పాదములకు రక్త ప్రసరణ చేకూరుస్తాయి.

127 ::