పుట:Hello Doctor Final Book.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

electrical impulse) భంగము ఏర్పడి కర్ణికల, జఠరికల వేగము మందగించిన వారికి కృత్రిమ హృదయ విద్యుత్ ప్రేరకములు (cardiac pacemakers) అమర్చాలి. హృదయ కవాట పరిమాణములు బాగా తగ్గిన వారికి (valvular stenosis), పరిమాణములు పెరిగి రక్త తిరోగమనము (valvular regurgitation) విపరీతముగా ఉన్నవారికి కొత్త కవాటములు అమర్చాలి.

హృదయకోశములో నీరు చేరితే (pericardial effusion) ఆ నీటిని తొలగించాలి. హృదయకోశపు తాపము (pericarditis) వలన హృదయ ముకుళిత వికాసములకు భంగము ఏర్పడిన వారికి శస్త్రచికిత్సతో హృదయకోశమును తొలగించాలి (pericardiectomy ). ఎడమ జఠరిక నుంచి బృహద్ధమని లోనికి ప్రసరించు రక్తశాతము ప్రసరణశాతము (ejection fraction) 35 % కంటె తక్కువైతే, ఔషధములతో చికిత్స చేసి తగిన ప్రగతి కనిపించకపోతే, వారికి ప్రకంపన నివారణి (defibrillator) అమర్చి ఆకస్మిక హృదయ మరణములను తగ్గించవచ్చును.

జఠరిక సహాయ పరికరములు  (ventricular assist devices) తాత్కాలిక ప్రయోజనమునకు లభ్యము. ఇతర అవయవ వ్యాపారములు బాగుండి, వయోవృద్ధులు కాని వారికి గుండె మార్పిడి చికిత్స (cardiac transplantation) పరిశీలించాలి. హృదయవైఫల్యమును వైద్యులు నిత్యము చూస్తారు. కొందఱికి అత్యవసర చికిత్స అవసరము. చికిత్సలో రక్తపరీక్షలు, బాధితులను తఱచు పరీక్షించుట, చాలా అవసరము. ఇదివరలో లక్షణములకే చికిత్సలు ఉండేవి. ఇప్పుడు హృదయ వ్యాపారమును మెరుగు పఱచే చికిత్సలు లభ్యమయి హృదయ వైఫల్యము గలవారి ఆయుః ప్రమాణములలో పెరుగుదల, లక్షణములకు మెరుగుగా ఉపశమనము లభించుట గమనిస్తున్నాము.

126 ::