పుట:Hello Doctor Final Book.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(contractility) పెంపొంద జేస్తాయి. హృదయ వేగమును తగ్గిస్తాయి. హృదయ వైఫల్యమునకు ఒకప్పుడు తప్పనిసరిగా వాడే డిజాక్సిన్ మెరుగైన మందులు రావడము వలన, దీని అవాంఛిత ఫలితముల వలన ఈ దినములలో ఎక్కువగా వాడబడుట లేదు. కర్ణికా ప్రకంపనము (atrial fibrillation) కలవారిలో జఠరికల వేగమును అదుపులో పెట్టుటకు, వారి హృదయ వైఫల్యపు చికిత్సలోను డిజాక్సిన్ కు స్థానము ఉంది. రక్తములో దీని విలువలను తఱచు పరీక్షించాలి. విలువలు అధికమైతే వికారము, వాంతులు, హృదయవేగము మందగించుట, లయ తప్పుట వంటి అవాంఛిత ఫలితములు కలుగుతాయి. మూత్రకారకములు ( Diuretics ) :

హృదయ వైఫల్యము వలన ఉప్పు, నీరు శరీరములో అధికమయి, కాళ్ళలో నీటిపొంగులు (edema) కలిగిన వారిలోను, ఊపిరితిత్తులలో నీటిపొంగు, సాంద్రత (congestion) ఎక్కువయి ఆయాసము వంటి బాధలు కలిగిన వారిలోను ఆ లక్షణములను నివారించుటకు మూత్రకారకములు ఉపయోగించవలసి ఉంటుంది. ఇవి మూత్ర ఉత్పత్తిని పెంచి శరీరములో నీటిని, ఉప్పును తగ్గిస్తాయి. వీటిని ఉపయోగించునపుడు రక్తములో విద్యుద్వాహక లవణముల (electrolytes) విలువలను, యూరియా నైట్రొజెన్ /  క్రియటినిన్ విలువలను, రక్తపీడనమును తఱచు గమనించాలి.

రక్తప్రమాణము విపరీతముగా తగ్గకుండా జాగ్రత్త పడాలి. రక్తప్రమాణము బాగా తగ్గినపుడు (hypovolemia) నిటారు స్థితిలో రక్తపీడనము తగ్గి కళ్ళుతిరుగుట, సొమ్మసిల్లుట వంటి లక్షణములు కలుగవచ్చును. శరీరపు బరువును గమనించి, పాదములు, కాళ్ళలో పొంగులను గమనిస్తూ, రోగులను తఱచు పరీక్షిస్తూ తగిన రక్తపరీక్షలు చేస్తూ వైద్యులు మూత్రకారకముల మోతాదును సరిచేస్తుంటారు. థయజై డు మూత్రకారకములు ( thiazide diuretics ) :

హైడ్రోక్లోర్ థయజైడ్ (Hydrochlorthiazide), క్లోర్ థాలిడోన్ (Chlorthalidone) సాధుమూత్రకారకములు. మితముగా నీటిపొంగులు

122 ::