పుట:Hello Doctor Final Book.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధ్య సంధానములు (arteriovenous fistulas), విటమిన్ -బి-1 థయమిన్ లోపము వలన కలిగే బెరిబెరి, పేజెట్స్ వ్యాధి (Paget‘s disease) వంటి అధికప్రసరణ వైఫల్య వ్యాధులు (high output  failure) హృత్కోశ ఆకుంచనము (pericardial constriction), కర్ణికా ప్రకంపనము (atrial fibrillation) హృదయ వైఫల్యము కలిగిస్తాయి.

హృదయ రక్తప్రసరణ లోపాలు, రక్తపుపోటు, హృదయకవాట వ్యాధులు వీనిలో ముఖ్యమైనవి. ఇవి అధికశాతపు మందిలో హృదయ వైఫల్యము కలిగిస్తాయి. వ్యాధిప్రక్రియ ( Pathogenesis ) :

హృదయము రక్తప్రసరణకు సహాయపడే ప్రధానమైన తోడు యంత్రము. శరీరములో యితర కండరములు సిరలనుంచి రక్తమును గుండెకు చేర్చుటకు కొంత తోడ్పడుతాయి. హృదయ కండరముల ముకుళిత ( systole ) వికాసముల (diastole) వలన రక్తప్రసరణ జరుగుతుంది. హృదయములో నాలుగు అరలుంటాయి. పై గదులు కుడి ఎడమ కర్ణికలు (atria). క్రింది అరలు కుడి ఎడమ జఠరికలు (ventricles). దేహము నుంచి రక్తము ఊర్ధ్వ, అధో, బృహత్ సిరల ద్వారా కుడి కర్ణికకు చేరుతుంది. కుడి కర్ణిక నుంచి రక్తము త్రిపత్ర కవాటము ( tricuspid valve ) ద్వారా కుడి జఠరికకు  చేరుతుంది. కుడి జఠరిక నుంచి పుపుస కవాటము (pulmonary valve), పుపుస ధమనుల (pulmonary artery) ద్వారా ఊపిరితిత్తులకు చేరి అచట ప్రాణవాయువును గ్రహించుకొని బొగ్గుపులుసు వాయువుని విసర్జించుకొని పుపుస సిరల (pulmonary veins) ద్వారా రక్తము ఎడమ కర్ణికకు చేరుతుంది. ఎడమ కర్ణిక నుంచి ద్విపత్ర కవాటము (bicuspid valve) ద్వారా ఎడమ జఠరికకు, ఎడమ జఠరిక ముకుళించు కున్నపుడు బృహద్ధమని కవాటము (aortic valve) ద్వారా బృహద్ధమనికి (aorta), దాని శాఖల ద్వారా వివిధ అవయవాలకు రక్తము చేరి కణజాలమునకు ప్రాణవాయువును పోషకపదార్థములను చేర్చి కణజాలము నుంచి బొగ్గుపులుసు వాయువును, వ్యర్థపదార్థములను గ్రహిస్తుంది. వ్యర్థ పదార్థములను విచ్ఛిన్నము చేయుటకు, విసర్జించుటకు కాలేయము,

113 ::