పుట:Hello Doctor Final Book.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాధులు కలిగే అవకాశము ధూమపానము సలుపని వారితో సమానము అవుతాయి. రక్తపరీక్షలలో C reacttive protein 2 mgm /dl మించిన వారిలోను, హృద్ధమనులలో కాల్సియం ప్రమాణములు పెరిగిన వారిలోను, దూరధమని వ్యాధులు (Peripheral Arterial Diseases) కలవారిలోను హృద్ధమని వ్యాధులు కలిగే అవకాశములు హెచ్చు. హృదయ ధమనులలో కాఠిన్యఫలకలు ఏర్పడి వాని లోపల పరిమాణము తగినంత (40- 70 శాతము) తగ్గినపుడు శ్రమతోను, వ్యాయామముతోను హృదయమునకు ప్రాణవాయువు, పోషకపదార్థముల అవసరములు పెరిగి అవి తీరనపుడు గుండెనొప్పి (angina pectoris) కలుగుతుంది. ధమనీకాఠిన్య ఫలకలు స్థిరముగా ఉన్నపుడు హృద్ధమనివ్యాధి స్థిరమని (stable angina) పరిగణిస్తారు. హృద్ధమనులలో ధమనీకాఠిన్య ఫలకలు (atherosclerotic plaques) చిట్లినపుడు, ఆ ఫలకలపై సూక్ష్మరక్తఫలకములు (platelets) అంటుకొని వానిపై రక్తపుగడ్డలు (thrombi) ఏర్పడి నాళములో రక్తప్రసరణకు అవరోధము కలిగించినపుడు తీవ్రమైన గుండెనొప్పి (unstable angina) కాని గుండెపోటు (heart attack; Myocardial infarction) కాని కలుగుతాయి. వీటిని సత్వర హృద్ధమని వ్యాధులుగా (Acute Coronary Syndrome) వర్గీకరిస్తారు.

హృద్ధమనిలో ప్రసరణ అవరోధము పాక్షికము అయినా, తాత్కాలికము అయినా హృదయకండర కణజాలములో ప్రసరణరహిత మరణము (infarction) కలుగకపోయినా, అసాధారణము, తీక్ష్ణము అయిన గుండెనొప్పి కలిగి హెచ్చు సమయము (20 నిముషములు మించి) ఉండుట, హెచ్చు తీవ్రత కలిగి ఉండుట, తక్కువ శ్రమతో కాని, విశ్రాంత సమయములోనే కలుగుట వంటి లక్షణములు ఉండుట వలన దానిని అస్థిరపు గుండె నొప్పిగా (Unstable Angina) వైద్యులు పరిగణిస్తారు. వీరికి త్వరితముగా ఔషధములతో చికిత్స చేసి ఆపై వారికి (చర్మము ద్వారా) హృదయ ధమనుల వ్యాకోచ చికిత్సలు (Percutaneous Coronary Intervention) అవసరమో కాదో నిర్ణయించాలి.

99 ::