పుట:Haravilasamu-Vavilla-1966.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

పీఠిక


తే. "పాకనాటింటివాఁడవు బాంధువుండవు
    కమలనాభునిమనుమఁడ వమలమతివి
    నాకుఁ గృపసేయు మొకప్రబంధంబు నీవు
    కలితగుణధన్య శ్రీనాథకవివరేణ్య."


అని పలికె నని భీమఖండమున శ్రీనాథుఁడే వచించి యున్నాఁడు. ఇందు "కమలనాభుని మనుమఁడ" వనియుఁ బేర్కొనినందున, శ్రీనాథుఁడే కాక యితని తాత యగు కమలనాభుఁడు గూడ నన్నయమంత్రికిఁ జుట్ట మని తేటపడుచున్నది.

మఱియు నాంధ్రభాగవతము రచించి శ్రీరామున కర్పణము సేసిన భాగవతోత్తముఁ డగు బమ్మెర పోతరాజునకును శ్రీనాథునకును సంబంధించిన శిష్టపరంపరాగతము లగు గాథలను బట్టి చూడఁ గొన్ని గాథలు సత్యాసత్యములుగ నున్నను, వేంకటగిరివంశావళివలన సర్వజ్ఞ సింగమనాయనికాలములో నీకవులు సమకాలికులుగ నున్నట్లు తెలియుచున్నందునఁ గింవదంతి కనుకూలముగ నుభయులు బావమఱఁదులు నై యుండవచ్చును గదా!

ఇఁకఁ గవిత్వములోఁ గన్నడపదములు ప్రాయికములుగాఁ గనఁబడుచున్న వనుటకుఁ దిక్కన సోమన మున్నగు వారి కవిత్వమునఁ గూడఁ గలవు. కావున వారిం గర్ణాటు లని యనఁదగదు గదా! ఒకవేళ శ్రీనాథుఁడు కర్ణాటదేశీయుఁడై యా దేశభాషయందుఁ బ్రేమగలిగిన వాఁడైన నెన్నియో కర్ణాటగ్రంథముల రచింప కుండునా! ఏదీ యొక పర్యమయినం గానరాదే?