పుట:Haravilasamu-Vavilla-1966.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

పీఠిక

గంబునఁ బాండిత్యశౌండీర్యంబున నుద్దండుఁ డగు డిండిమభట్టారకు నోడించి ప్రభుపండితసమ్మానపూర్వకంబుగఁ గవిసార్వభౌమబిరుదమున నలరారుటయు కాక, యక్కవిసూర్యుఁడు కర్ణాటరాజధాని (యందలి విబుధరాజి) యను కమలవనమునకు సూర్యుఁడై యుండె నను నభిప్రాయమును దనకుఁ గూర్చుకొనియెఁ గాని కర్ణాటదేశాభిమానమునం గా దనియు,

"నాకవిత్వంబు నిజము కర్ణాటభాష" అను పద్యము రాజమహేంద్రవరాధీశుమంత్రి బెండపూడి యన్నయామాత్యునకుఁ గృతి యిచ్చిన భీమఖండములోనిది గాన, కోమటి వేమభూపాలు మరణానంతరము కొండవీటిరాజ్యము కర్ణాటాధీనము కాఁగా, శ్రీనాథుఁ డన్నామాత్యుబాంధవ్యమునుబట్టి రాజమహేంద్రవరమున కేతెంచి తద్రాజాస్థానకవీశ్వరుఁడుగ నున్న కాల మగుటచేఁ గాకతీయ రాజ్యమంతరించినపిదప నాంధ్రదేశమున దక్షిణభాగము (పాకనాటిసీమవఱకు గలదేశము) కర్ణాటరాజ్య మనఁ బరఁగుచున్నందున నచ్చటివాఁ డగు శ్రీనాథుని గుఱించి రాజమహేంద్రవరపుఁగవులు కొంద ఱీతని కవిత్వము సంస్కృతమనియుఁ గొందఱు కన్నడమనియు వంకలు పెట్ట "నెవ్వ రేమన్న నండ్రు నా కేమి కొఱఁత, నాకవిత్వంబు నిజము కర్ణాటభాష" యని యుత్తరము చెప్పియుండు ననియు,

"తల్లీ! కన్నడరాజ్యలక్ష్మి" యను కర్ణాటదేశ మాతృ సంబోధనము తన కాశ్రయు లగు కొండవీటిరెడ్లు, రాజమహేంద్రవరపురెడ్లు, తెలుఁగురాయఁడు, మైలా రెడ్డిమున్నగువారు స్వర్గస్థు లయినపిదప వార్ధక్యములోఁ గన్నడరాజ్యమున కేఁగినపు డాకాలస్థితిని బట్టి వారు త న్నాదరింపకుండఁగ "తల్లీ!