పుట:Gutta.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్థితి ఏర్పడినది. తల్లితండ్రులు పెద్దమ్మ అను గ్రామదేవతను ఇంటి దేవతగా పూజించేవారు. అందువలన అదే పేరునే పుట్టిన బిడ్డలకు పెట్టెడివారు. ఆ పద్ధతిలోనే నేడు ఆచార్య ప్రబోధానందయోగీశ్వరులుగా ఉన్న ఆయన అందరిచేత పెద్దన్నగా పిలువబడెడివాడు. పదహారు సంవత్సరముల వయస్సులోనే తల్లితండ్రులు విడిపోవడము వలన తల్లిని పోషించే బాధ్యత ఆయన మీదే పడింది. తల్లిని పోషిస్తూ 1969 మే నెలకు ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి (పదకొండవ తరగతి) ని పూర్తి చేయగలిగి, అదే సంవత్సరము బ్రతుకు తెరువు నిమిత్తము మిలిటరీలో ఒక భాగమైన ఆర్మీలో చేరి దాదాపు మూడు సంవత్సరములు అందులో చేయగలిగాడు. బ్రతుకుతెరువు కొరకు ఆర్మీలో పని చేయుచున్నప్పటికీ అక్కడ ఆఫీసర్‌లతో సమానముగా ఆఫీస్‌లోనే పని ఉండేది. అక్కడి ఆఫీసర్‌లందరు ఎంతో పరిచయముగా ఉండేవారు. అటువంటి స్థితిలో పెద్దన్న అను ఆయన అప్పుడప్పుడు దైవజ్ఞానమును గురించి అక్కడి అధికారులకు సమయము దొరికినప్పుడంతా చెప్పెడివాడు. ఆ సందర్భములో ఈ ఉద్యోగము నాకు సరిపోదు, నేను బయటి మనుషులలో ఉండి వారికి ఎంతో జ్ఞానము చెప్పవలసివుంది అని చెప్పెడివాడు. ఆ రెజిమెంట్‌లో ఉన్న అధికారులు ఆ మాటకు స్పందించి ఆయనను ఆర్మీనుండి బయటకు పంపించడము జరిగినది.


ఉద్యోగము వదలి బయటికి పోతే ఎలా బ్రతుకుతావు అను ప్రశ్న ఒకటి వేధిస్తున్నా, దానికి సమాధానమును వెదకకుండానే ఉద్యోగము నుండి బయటికి వచ్చి ఎంతో శ్రమపడవలసివచ్చినది. కర్నాటకలో ఒక సంవత్సర కాలము వ్యవసాయము చేయవలసివచ్చినది. తర్వాత తప్పనిసరిగ ప్రవేట్‌ కంపెనీలో క్లర్క్‌ ఉద్యోగమును చేయవలసివచ్చినది. మనస్సుకు నచ్చని పని అయినందున దానిని కూడా ఆరునెలలకే వదలివేయడము జరిగినది.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/15&oldid=279901" నుండి వెలికితీశారు